తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఛాలెంజ్‌ల పర్వం తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విసిరిన బహిరంగ సవాల్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష అత్యంత అభ్యంతరకరంగా ఉందని, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సభలో ప్రతిపక్ష సభ్యుల పట్ల గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడటమే కాకుండా, కాంగ్రెస్ సభ్యులు ఏకంగా అసెంబ్లీ ప్రాంగణంలోనే దాడులకు తెగబడేలా బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ప్రత్యర్థులపై అసెంబ్లీలో చర్చించాల్సింది పోయి, ఎథిక్స్ కమిటీ పేరుతో వేధింపులకు పాల్పడటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే సీఎంకు రాజకీయంగా గట్టి సవాల్ విసిరారు. దమ్ముంటే కొడంగల్ అసెంబ్లీ స్థానానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాజీనామా చేయాలని, తాను కూడా హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇద్దరం కలిసి మళ్లీ ఉపఎన్నికల బరిలో నిలుద్దామని, అక్కడ రేవంత్ రెడ్డి తన పార్టీ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకున్నా సరే తాను శాసనసభ సాక్షిగా ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.
కాగా, పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్(Congress)లోకి వెళ్లిన నేతల తీరును కౌశిక్ రెడ్డి తప్పుబట్టారు. ముఖ్యంగా కడియం శ్రీహరి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్ బీ-ఫారమ్‌పై గెలిచి, పార్టీ మారిన ఆయనకు నైతిక విలువలు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. డిప్యూటీ సీఎం పదవులు, ఇతర ఉన్నత పదవులు అనుభవించినప్పుడు లేని నైతికత, ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారిన తర్వాత గుర్తుకొచ్చిందా అని నిలదీశారు. తల్లిలాంటి పార్టీని వీడి వెళ్లిన నాయకులు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని కౌశిక్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.