తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మెగా కుటుంబం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల(Sushmita Konidela)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక నుంచి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక ఉత్సవాల్లో సుస్మిత కొణిదెల భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు.
అయితే ఇది మెగా కుటుంబానికి దక్కుతున్న తొలి పదవి మాత్రం కాదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన సోదరుడు కొణిదెల నాగబాబుకు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా కీలక పదవి దక్కింది. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ మెగా ఫ్యామిలీ ప్రాధాన్యత కనిపించింది. యాదగిరిగుట్ట దేవస్థానం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు దక్కింది. ఇలా వరుసగా వస్తున్న నియామకాలతో మెగా కుటుంబం రెండు రాష్ట్రాల్లోనూ తమదైన ముద్ర వేస్తోంది.
రాజకీయ, సినీ రంగాల్లో బలమైన పట్టు ఉన్న మెగా కుటుంబ(Mega Family) సభ్యులకు ఇలా వరుసగా పదవులు దక్కడం పలు రాజకీయ విశ్లేషణలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యమే ఈ నియామకాలకు కారణమన్న చర్చ నెటిజన్లలో జోరుగా సాగుతోంది. మొత్తానికి, సినిమా నుంచి రాజకీయాల దాకా, ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రాల పాలక మండళ్ల దాకా మెగా ఫ్యామిలీ ప్రభావం విస్తరిస్తుండటం విశేషంగా మారింది.