సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ, యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ‘నందూస్ వరల్డ్’ (Nandu's World) ఛానెల్ నిర్వాహకురాలు రమా నందన అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. లండన్ ఉద్యోగాలు, వీసాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో RGIA పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరుకు చెందిన రమా నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ యూకేలో స్థిరపడ్డారు. వీరు ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ ద్వారా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి నుంచి UK వీసా రెన్యూవల్, ఉద్యోగం పేరుతో రూ.15 లక్షలు వసూలు చేశారు. అయితే నెలలు గడిచినా వీసా రాకపోగా, వారు ఇచ్చిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) కూడా నకిలీదని తేలింది. బాధితుడు నిలదీయగా కేవలం రూ.2 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చి మిగతా డబ్బు ఇవ్వకుండా ముఖం చాటేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మధుకర్ A1గా, రమా నందన A2గా, మధుకర్ తండ్రి మోహన్‌రావు A3గా నిందితులుగా ఉన్నారు.
ఈ ఉదంతం బయటకు రావడంతో మరికొందరు బాధితులు కూడా ఒక్కొక్కరుగా ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. కేవలం భారతీయులే కాకుండా కొందరు పాకిస్థానీయులు సైతం తాము వీరి చేతిలో మోసపోయామని, రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు నష్టపోయామని ఆరోపిస్తున్నారు. స్పాన్సర్‌షిప్‌ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసి మోసం చేశారనే ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు వీరిపై లుకౌట్ నోటీసులు (LOC) జారీ చేశారు. యూకేలో ఉంటున్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా, తాజాగా రమా నందన(Rama Nandana) భారత్‌కు రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
రమా నందన కేవలం యూట్యూబర్‌గానే కాకుండా సినిమాల్లోనూ నటనపై ఆసక్తితో కొన్ని ప్రాజెక్ట్‌లలో పనిచేశారు. ఇటీవలి కాలంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోనూ ఆమె నటించారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై నందన(Nandana) గతంలోనే స్పందిస్తూ ఖండించారు. తమకు ఎలాంటి కన్సల్టెన్సీ లేదని, కొందరు కావాలనే వ్యక్తిగత కక్షలతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె వాదించారు. అంతేకాదు, ఈ కేసును కొట్టివేయాలని నిందితులు ఏకంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో చిక్కిన నందన అరెస్ట్‌తో ఈ కేసులో ఎలాంటి సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.