వైసీపీకి స‌జ్జ‌లే స‌మ‌స్య‌

admin
Published by Admin — August 30, 2026 in Politics
News Image
``పాద‌యాత్ర చేసి పార్టీని నిల‌బెట్టిన వారు పోయారు. బైబిల్ ప‌ట్టుకుని ఊరూ వాడా తిరిగిన మాతృమూర్తిని ప‌క్క‌న పెట్టారు. మ‌ధ్య‌లో వ‌చ్చి.. మ‌ధ్య‌లో ప‌గ్గాలు చేప‌ట్టిన స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదా.. మేం కోరుకున్నది.`` అంటూ.. గత రెండేళ్ల కింద‌ట వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత ఒక‌రు చేసిన వ్యాఖ్య ఇది. `జ‌గ‌న్ మంచోడే.. కానీ, స‌జ్జ‌లే య‌మ కంత్రీ` అనేశారు కూడా!. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి వ్య‌వ‌హారంపై మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఒక‌ప్పుడు వైసీపీకి ఐకాన్‌నాయ‌కుడిగా మారిన సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో స‌జ్జ‌ల వ్య‌వ‌హారంపై పార్టీలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.
 
వైఎస్ మ‌ర‌ణానంత‌రం..
 
వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం.. జ‌గ‌న్‌కు చేరువైన `ఎడిట‌ర్‌` స‌జ్జ‌ల‌. జ‌గ‌న్ సొంత మీడియా సాక్షిలోకి ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్గా ప్ర‌వేశించిన ఆయ‌న‌.. అనంత‌రం.. రాజ‌శేఖ‌రరెడ్డి మ‌ర‌ణానంత‌రం.. పార్టీ పెట్టిన జ‌గ‌న్‌కు మ‌రింత చేరువ అయ్యారు. అయితే.. 2019 వ‌ర‌కు ఆయ‌న పాత్ర ప‌రిమితంగానే ఉంది. కానీ, పార్టీ 2019లో విజయం ద‌క్కించుకున్నా.. స‌జ్జ‌ల పాత్ర పెరిగిపోయింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో మంత్రులుగా ప‌నిచేసిన రాజా న‌గ‌రం మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే వంటి వారు బాహాటంగానే చెప్పుకొచ్చారు. వీరిలో బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. రాజాన‌గ‌రం మాజీ ఎమ్మెల్యే మాత్రం ప్ర‌స్తుతం ముభావంగానే కొన‌సాగుతున్నారు.
 
ఎందుకు?
 
వైసీపీకి జ‌గ‌న్ అధ్య‌క్షుడు. అయితే.. అన‌ధికార అధ్య‌క్షుడిగా స‌జ్జ‌ల ఎదిగిపోయారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌విని కూడా జ‌గ‌న్ క‌ట్ట‌బెట్టారు. ఇది ఆయ‌న‌కు మ‌రింత అండ‌గా మారింది. ఫ‌లితంగా.. తాను చేసిన నిర్ణ‌యం.. ఫైనల్ అనే స్థాయిలో స‌జ్జల రెచ్చిపోయార‌న్న‌ది పార్టీ నాయ‌కుల అభిప్రాయం. అంతేకాదు.. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ల పంప‌కం విష‌యంలోనూ స‌జ్జ‌ల కీలక పాత్ర పోషించార‌న్నది అప్ప‌టి నాయ‌కులు చెప్పిన మాట‌. ఓ మాజీ మంత్రిని వెనుకేసుకు రావ‌డంతోపాటు..బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం నాయ‌కులను, రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కుల‌ను కూడా తొక్కిపెట్టార‌ని ప్ర‌చారంలో ఉంది.
 
పార్టీనే కాదు.. వ్య‌క్తిగ‌తంగా కూడా..
 
కేవ‌లం పార్టీనే కాకుండా.. జ‌గ‌న్ ప్యామిలీ వ్య‌వ‌హారాల్లోనూ స‌జ్జ‌ల పాత్ర కీల‌కంగా ఉంద‌ని అప్ప‌ట్లో చాలా మంది చెప్పారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ సోద‌రి, పాద‌యాత్ర ద్వారా పార్టీని బ‌లోపేతం చేసిన ష‌ర్మిల‌, జ‌గ‌న్ మాతృమూర్తి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక్క ఛాన్స్ అంటూ..ఊరూవాడా తిరిగిన విజ‌య‌మ్మ స‌హా.. కీల‌క నేత‌ల‌ను నియంత్రించ‌డంతోపాటు.. వారు బ‌య‌ట‌కు వ‌చ్చేలా కూడా.. వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న ఉంది. సజ్జ‌ల కార‌ణంగానే తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అనేక మంది నాయ‌కులు చెప్పుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ప్ర‌భ వెలుగుతూనే ఉంది. ఏదేమైనా.. తాజాగా విజ‌యసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల అనంత‌ర‌మైనా జ‌గ‌న్ దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకుంటారా? లేక స‌జ్జ‌ల‌నే స‌మ‌ర్థిస్తారా? అనేది చూడాలి.
Tags
sajjala ycp jagan Vijayasai Reddy
Recent Comments
Leave a Comment

Related News