మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై టీడీపీ గ్లోబల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా వెల్లడించారు. సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరు కాబోతున్నారని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని డాక్టర్ రాజా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఎన్నారై టీడీపీ నేతలు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని వెల్లడించారు. మునుపెన్నడూ జరగని విధంగా ఈ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైందన్నారు.
కొద్దిరోజుల క్రితం అమెరికాలో పర్యటించిన నారా లోకేశ్ తో డాక్టర్ రాజా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9వ తేదీన ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నారై టీడీపీ గ్లోబల్ కమిటీ నియామకం జరిగింది. అంతేకాదు, ఆ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఏపీలో జరగడం, ఆ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.