వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ పర్యటనలకు వస్తున్నారంటే చాలు ఎన్ని చెట్లు నరకాల్సి వస్తుందో అంటూ పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంపై ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప నాటే ఆలోచన చేయలేదని ఘాటు విమర్శలు చేశారు. అయితే, తమ ప్రభుత్వానిది నరికే సంస్కృతి కాదని, నాటే సంస్కృతి అని నాగబాబు అన్నారు.
హరితాంధ్రప్రదేశ్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటాలని నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్యారామం నందనవనంలో అశ్వత్థ నారాయణ వివాహం కార్యక్రమం లో నాగబాబు, ఆయన సతీమణి పద్మజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమాతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని నాగబాబు చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనది ఒకే రకమైన ఆలోచన అని అన్నారు. 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోతున్న అరణ్యారామం భవన డిజైన్లను నాగబాబు పరిశీలించారు. 10 నెలలలోపు ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేసేలా ప్రణాళికలు రచించారు.