మారుమూల గిరిజన ప్రాంతాలలో వైద్య సేవలు అందక సకాలంలో మందులు దొరక్క గిరిజన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు.... అదే సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ల సాయంతో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు మందులు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు...ఆ ముఖ్యమంత్రిపై గిరిజనులు ప్రశంసలు కురిపిస్తుంటారు...అయితే ఇదేదో సినిమాలో జరిగిన సీన్ కాదు....రియల్ లైఫ్ లో ఏపీ సీఎం చంద్రబాబు గిరిపుత్రుల కోసం డ్రోన్లను ఉపయోగించిన వైనంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో తలపెట్టిన డ్రోన్ ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సమీక్షించారు. అత్యవసర వైద్య సేవలు అందించడంలో డ్రోన్లు విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసర మందులు, రక్త నమూనాల సేకరణ వంటి పనులు చేయడంలో డ్రోన్లు కీలకమని అన్నారు. డ్రోన్ల వ్యవస్థ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఆసుపత్రులతో అనుసంధానించడం సులభతరం అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.