రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, ఒక పార్టీ తన బలాన్ని తానే నమ్మలేకపోతున్నప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఏపీ(AP) రాజకీయాల్లో ఇప్పుడు సరిగ్గా ఇదే చర్చ నడుస్తోంది. ప్రజలందరూ తమ వెంటే ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఊచకోత కోస్తామని వైసీపీ నేతలు పదేపదే గొప్పలు చెబుతుంటారు. అనుకూల సర్వేలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తుంటారు. మరి ఇదంతా నిజమే అయితే, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను చూసి ఆ పార్టీ ఎందుకు హడలిపోతోంది? గ్రౌండ్‌లో సీన్ వేరుగా ఉందనే భయంతోనే లీగల్ బ్యాక్‌డోర్ రూట్లు వెతుకుతోందా? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది?
ఒకవైపు ప్రజాదరణ ఉందని చెప్పుకుంటూనే, మరోవైపు ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడానికి హైకోర్టును ఆశ్రయించడం విచిత్రంగా ఉంది. ఓటర్ల జాబితా, సర్ ప్రక్రియ పూర్తి కాలేదనే సాకుతో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ద్వారా కోర్టులో పిటిషన్ వేయించడం వెనుక వ్యూహం ఏంటి? ప్రజలు నిజంగానే మీ వెంటే ఉంటే, ఎన్నికలను ఒక పండగలా స్వాగతించి, భారీ విజయంతో ప్రత్యర్థుల నోర్లు మూపించాలి కదా! కానీ, ఇందుకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియనే నిలిపివేయాలని కోరడం చూస్తుంటే.. జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)కి తన సొంత పార్టీ బలంపై నమ్మకం సడలిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాజకీయ రంగంలో ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడే ఇలాంటి డబుల్ గేమ్ వ్యూహాలు తెరపైకి వస్తాయి. బయటకు మాత్రం తామే అజేయులమని బిల్డప్ ఇస్తూ, లోలోపల మాత్రం ఓటమి భయంతో ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రయత్నించడం హాస్యాస్పదంగా మారుతోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా, ప్రజాస్వామ్యంలో అది సాధారణమే అనుకోవచ్చు. కానీ, పారిపోయే ధోరణిని అవలంబించడం వల్ల సొంత కేడర్‌లోనే నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. సర్వేలు నిజమని నమ్మించే గోల్డెన్ ఛాన్స్‌ను వైసీపీ(YCP)నే స్వయంగా చేజార్చుకుంటోందా? లేక ఇది కాలం తెచ్చిన కడుపుకోతా? కాలమే సమాధానం చెప్పాలి.