వైసీపీ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy)కి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకమైన నేతగా పేరున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసిపోవచ్చనే ధోరణిలో అనిల్ మాట్లాడటం చూసి, కేడర్ ఆశ్చర్యానికి గురయ్యారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav)కు జగన్ ఇచ్చిన అవకాశాలు తక్కువేమీ కావు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అనిల్‌కు పార్టీలో మంచి గుర్తింపే ఉంది. అయితే భవిష్యత్తులో తనకు మరోసారి అవకాశం దక్కుతుందో లేదో అనే అనుమానాన్ని ఆయనే స్వయంగా వ్యక్తం చేయడం విశేషం.
గత వైసీపీ(YCP) ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అనిల్ తీరుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. శాఖాపరమైన పనుల కంటే ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించడంలోనే ఎక్కువ చొరవ చూపారన్న అభిప్రాయం ఏర్పడింది. టీడీపీ, జనసేన నేతలపై నాటి రోజుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా బాగా చర్చనీయాంశమయ్యాయి. కానీ 2024 ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలవడంతో అనిల్ రాజకీయంగా వెనుకబడిపోయారు.
ఇప్పుడు వచ్చే ఏడాది జగన్ చేపట్టబోయే పాదయాత్ర నేపథ్యంలో పార్టీ నేతలంతా యాక్టివ్ మోడ్‌లోకి వెళ్తారని అంతా భావిస్తుంటే, అందుకు పూర్తి భిన్నంగా అనిల్ చేసిన వ్యాఖ్యలు క్యాడర్‌కు నిజంగానే షాక్ ఇచ్చాయి. ఇది కేవలం ఒక నేత వ్యక్తిగత అభిప్రాయమేనా, లేక పార్టీలో ఏదైనా అంతర్గత అసంతృప్తికి సంకేతమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, ఇప్పటికే వైఎస్ఆర్(YSR)కు అత్యంత సన్నిహితులుగా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు జగన్‌కు దూరమై టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్ కూడా అదే బాటలో నడుస్తారా, లేక నిజంగానే క్రియాశీల రాజకీయాలకు వీడ్కోలు పలుకుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.