ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వైసీపీదే హవా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. జిల్లాల్లో పార్టీ నాయకులతో సమావేశాలు పెడుతూ, ప్రజలంతా మన వైపే ఉన్నారంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారంలో లేకపోయినా, క్షేత్రస్థాయిలో కేడర్‌ను మోటివేట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్న తీరు ఆసక్తికరంగానే ఉన్నా.. క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే, ఒకవైపు ప్రజల మద్దతు తమకే ఉందని చెబుతూనే, మరోవైపు చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వదంటూ జగన్ ముందుగానే ఆరోపణలు గుప్పించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు ముందే ఓటమికి ఇలాంటి కుంటి సాకులు వెతకడం ఏపాటి సమంజసమని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కేడర్‌ను పెద్దగా పట్టించుకోకుండా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే పాలన సాగించారనే విమర్శలు ఎదుర్కొన్న జగన్.. ఇప్పుడు మాత్రం అకస్మాత్తుగా "ప్రతీ కార్యకర్త వెనుక మీ నాయకుడున్నాడనే భరోసా కల్పించండి" అంటూ నేతలకు హితబోధ చేయడం విచిత్రంగా కనిపిస్తోంది.
మరోవైపు, గతంలో పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే భారీగా నజరానాలు ప్రకటించిన సంగతిని పలువురు గుర్తుచేస్తున్నారు. నాడు అదే విధానాన్ని ప్రోత్సహించిన నేతలు, ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగితే అది నేరమన్నట్లుగా మాట్లాడటం, ఒకవేళ అలా జరిగితే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని హెచ్చరించడం పార్టీలో గుబులు పుట్టిస్తోంది. కేడర్‌ను నమ్మకంత్లో ముందుకు నడిపించాల్సింది పోయి, బెదిరింపుల ధోరణి అవలంబించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, స్థానిక పోరులో జగన్(Jagan) వేస్తున్న అడుగులు, ఆయన కంటున్న కలలు నిజంగానే ఫలిస్తాయా? లేక మరోసారి నిరాశే మిగులుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.