``ఉండవల్లి గారూ.. మీ పిటిషన్ సహా.. మీరు చేస్తున్న వాదనలు వింటుంటే.. మీరు ఎవరికో.. ఏ నేతకో ఫేవర్ చేయాలనుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటివాటిని కోర్టు ఎంటర్‌టైన్ చేయదు. అసలు మీకు.. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా చేసి.. ఏం చెప్పాలని అనుకుంటున్నారు?`` అని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఉండవల్లి తన లాయర్లతో కలిసి కోర్టులోనే ఉండడం గమనార్హం.
అనంతరం.. సుప్రీంకోర్టు ఉండవల్లి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ ఎల్‌పీ)ని సుప్రీంకోర్టు కొట్టి వేస్తున్నట్టు ప్రకటించింది. ఇలాంటి వాటిని ఎంటర్ టైన్ చేయడం కోర్టు సమయాన్ని, సాధారణ కక్షిదా రుల సమయాన్ని కూడా హరించడమేనని వ్యాఖ్యానించింది. పిటిషన్ వేసిన వారికి సంబంధిత వ్యాజ్యం లో ఎలాంటి ప్రమేయం లేకుండా.. ఎందుకు కోర్టుకు వస్తున్నారని.. న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే.. ఇది విస్తృత ప్రజా ప్రయోజనం కోసమేనని ఉండవల్లి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ సమయంలో కోర్టు .. ``కాదు.. దీనిలో ప్రజా ప్రయోజనం ఇసుమంతకూడా లేదు. ఇది ఎవరికో లాభం చేకూర్చే0ందుకు రాజకీయంగా చేసిన వాదనగా ఉంది.`` అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది?
మార్గదర్శి గ్రూపు సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాయని.. అనంతరం వాటిని ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నాయని పేర్కొంటూ ఉండవల్లి అరుణ్‌కుమార్.. గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా రు. ఇది అనేక మలుపులు తిరిగింది. అంతేకాదు.. ఒకదశలో ఈ కేసును మూసేయాలని కూడా తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఉండవల్లి సుప్రీంకోర్టులో ఎస్ ఎల్‌పీ వేశారు. దీనిని కూడా పలు మార్లు సుప్రీంకోర్టు విచారించింది. తాజాగా గురువారం జరిగిన విచారణలో మార్గదర్శి తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకుంది.
డిపాజిటర్లకు చెల్లించాల్సిన 2500 కోట్ల రూపాయలను వారి వారి ఖాతాల్లో వేశామని, మరో 5 కోట్ల రూపా యలను ఎక్స్రో ఖాతాలో జమ చేశామని సంస్థ తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరించారు. ఈ విషయాలతో కేసు పరిష్కారం అయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉండవల్లి తరఫున న్యాయవాది వాదనలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యానించింది. ఇది పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో ఎవరికో మేలు చేయాలన్న లక్ష్యంతో వేసిన ఎస్ ఎల్‌పీగా పేర్కొంటూ కొట్టేసింది.