ఏపీ అసెంబ్లీ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు ముగిశాయి. మొత్తం 4 రోజుల పాటునిర్వహించిన ఈ సమావేశాల్లో శాసన సభలో ప్రభుత్వ పక్షం దూకుడు, మండలిలో వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య వివాదం కొనసాగాయి. ఇక, మండలిలో ఏ అంశంపైనా చర్చ జరగకుండానే ముగిసిపోవడం ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. కేవలం అరుపులు, కేకలు.. నినాదాలతోనే మండలి ముగిసిపోయింది. చివరకు.. మండలిలో ఏయే అంశాలపై చర్చించాలన్న విషయంపైనా ఈ నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోకపోవడం గమనా ర్హం.
ఏడుకుపైగా బిల్లులకు ఆమోదం..
శాసన సభలో ఏడుకు పైగా బిల్లులకు ఆమోదం లభించింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు, విద్యా సంస్కరణ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ పాటించే బిల్లుకు సభ పచ్చజెండా ఊపింది. అలానే.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది. ప్రధానంగా బీసీల విషయమే ఈ సారి సభ లో హైలెట్ కావడం గమనార్హం. అలానే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మునిసిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయ ర్లను ప్రత్యక్ష విధానంలో ఎన్నుకునే బిల్లుకు కూడా ఆమోదం లభించింది.
మండలిలో..
మండలిలో నాలుగు రోజులు కూడా నినాదాలు, అరుపులు కేకలతోనే సభ ముగిసిపోయింది. కనీసం ఒక గంట సేపు కూడా అర్ధవంతమైన కార్యకలాపాలు జరగకపోవడం గమనార్హం. అయితే.. డిప్యూటీ చైర్మన్‌గా వైసీపీ నాయకుడు, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గవర్నర్ కోటాలో మండలిలో అడుగు పెట్టారు. ఆయనతో చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంతకు మినహా మండలిలో పెద్దగా ఏమీ జరగలేదు.
సభకు డుమ్మా..
ఈ సారి అటు అసెంబ్లీ, ఇటు శాసన మండలికి రాకుండా ఉన్నవారి జాబితా ఎక్కువగానే ఉందని సచివా లయం ప్రకటించింది. ఈ సారి అసెంబ్లీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. చివరి రోజు వచ్చినా.. ఆయన సభలోకి రాలేదు. ఇక, సీఎం చంద్రబాబు అసెంబ్లీకి మూడు రోజులే వచ్చారు. చివరి రోజు ఆయన చెన్నైలో కార్యక్రమానికి హాజర య్యారు. మంత్రి లోకేష్ సైతం ఈ సారి శాసన సభకే పరిమితం అయ్యారు. ఇక, వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఈ సారి కూడా సభకు రాకపోవడం గమనార్హం. ఈసారి సభలకు కూడా వైసిపి ఎమ్మెల్యేలు హాజరుకాని నేపథ్యంలో వారిపై వేటు తప్పదా అన్న చర్చ మొదలైంది.