వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి న విచారణలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ కేసులో సుపారీ కింద 4 కోట్ల రూపాయల మేరకు చేతు లు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. సీబీఐ తన దర్యాప్తులోనూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో అంత సొమ్ము ఎవరిచ్చారు? ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరెవరికి వెళ్లింది ? అనే అంశాలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టారు.
ఈ క్రమంలోనే ప్రస్తుత కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్‌రెడ్డి సహా.. ఈ కేసులో ప్రదాన ఆరోపణలు ఎదు ర్కొంటున్న సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వంటివారిపైనా ఈడీ దృష్టి పెట్టింది. తాజాగా శుక్రవారం ఉదయం 7 గంటలకే అటు హైదరాబాద్, ఇటు కడపల్లో సోదాలు నిర్వహించారు. కడపలోని నిందితుల నివాసాలతోపాటు.. వారి కార్యాలయాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. అలానే హైదరాబాద్ సహా.. విజయవాడలోని ఎంపీ అవినాష్ నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు.
తలా కొంచెం..
వివేకా దారుణ హత్య కేసులో సుపారీ కింద 4 కోట్ల రూపాయలకు మాట్లాడుకున్నారని గతంలో ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వెల్లడించిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు కూడా ఈ కోణంలో విషయాన్నిరాబట్టారు. అయితే.. ఈ మొత్తం ఒకరి నుంచే తీసుకోలేదని.. అధికారులకు, దర్యాప్తునకు చిక్కకుండా ఉండేందుకు సూత్రధారులు తలా కొంచెం నగదును షేర్ చేసుకున్నారని అధికారులు గుర్తించారు. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఈడీ ఇప్పటికే రెండు సార్లు దర్యాప్తు చేసింది.
తాజాగా.. మరోసారి ఈడీ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు సహా.. నేరారోపణ ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లనూ బూతద్దం పెట్టి వెతుకుతోంది. అయితే.. ఈ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అవినాష్ రెడ్డి తాడేపల్లిలో ఉండడంతో ఆయన విషయం తెలిసి హుటాహుటిన బయలు దేరినట్టు తెలిసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ నమోదు చేసిన మరో కేసు ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ వంటి అంశాల చుట్టూ తిరగడం గమనార్హం.