కావేరీ జలాల వివాదం, ప్రజలను వేధించే నిత్య సమస్యలు పక్కన వెళ్లిపోయాయి. ఇప్పుడు తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. అదే ప్రముఖ నటి త్రిష పేరు. రాష్ట్ర ప్రయోజనాలకంటే కూడా ఒక సినిమా నటి చుట్టూనే నేడు రాజకీయ చర్చలు కేంద్రీకృతమవడం సర్వత్ర విస్మయం కలిగిస్తోంది.
రాజకీయ లబ్ధి కోసం, పబ్లిసిటీ కోసం ప్రత్యర్థి పార్టీల నేతలు పదేపదే ఈ సినీ నటి పేరును తెరపైకి తెస్తున్నారు. తాజాగా తూత్తుకుడిలో జరిగిన ఒక సమావేశంలో ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరింత బలం చేకూర్చాయి. కావేరీ నీటి సమస్య కన్నా త్రిష నియామకమే రాష్ట్రంలో పెద్ద సమస్య అన్నట్లుగా ఆయన చేసిన చమత్కారాలు తీవ్ర దుమారం రేపాయి. టీవీకీ ప్రభుత్వం విజయ్(Vijay) సినిమాల్లో చేసిన నిర్మాతలు, సాంకేతిక నిపుణులకే పదవులు ఇస్తోంది.. మరి నటి త్రిషను ఎప్పుడు తమిళనాడు డిప్యూటీ సీఎం చేస్తారోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ తరహా రాజకీయ వ్యాఖ్యలపై విజయ్ నేతృత్వంలోని టీవీకే శ్రేణులు, త్రిష(Trisha) అభిమానులు భగ్గుమంటున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించడమే కాకుండా, మదురైతో పాటు పలు ప్రాంతాల్లో నిరసన పోస్టర్లు వెలిశాయి. మహిళా నటీమణులను రాజకీయ విమర్శలకు అస్త్రాలుగా మార్చడంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.
ప్రజల ప్రధాన సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తుండటంపై తమిళ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్ణాటక(Karnataka) నుంచి నీరు రాకపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అంశాలను ముందుకు తెస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.