వైఎస్ జగన్(YS Jagan)తో హీరో సుమంత్ హ్యూజ్ క్లోజ్ రిలేషనా..? ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ-రాజకీయ వర్గాల్లోనూ ఇదే హాట్ టాపిక్. ఒకరు టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కాగా, మరొకరు ఏపీకి మాజీ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరి మధ్య ఇన్ని రోజులు ఎవరికీ తెలియని ఓ మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్‌షిప్ యాంగిల్ ఉందని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!
అసలు వీరిద్దరి మధ్య ఈ సాన్నిహిత్యం ఎక్కడి నుంచి మొదలైంది? ఏళ్ల తరబడి ఈ బంధం ఎలా కొనసాగింది? అనే విషయాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో సుమంత్ స్వయంగా కొన్ని ఆసక్తికర నిజాలను బయటపెట్టారు. తన కొత్త మూవీ 'న్యూటన్స్ థర్డ్ లా(Newtons Third Law)' ప్రమోషన్లలో భాగంగా ఆయన పంచుకున్న ఈ విశేషాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' (HPS) అనగానే ఎందరో ప్రముఖుల పేర్లు గుర్తొస్తాయి. అయితే అదే స్కూల్‌లో వైఎస్ జగన్, హీరో సుమంత్ క్లాస్‌మేట్స్ మాత్రమే కాదు.. మంచి ప్రాణ స్నేహితులు కూడానట. సుమంత్ కంటే జగన్ రెండేళ్లు సీనియర్ అయినప్పటికీ.. ఇద్దరి మధ్య ఏనాడు ఆ అంతరం కనిపించలేదని సుమంత్ తెలిపారు. స్కూల్ రోజుల్లో తెగ అల్లరి చేస్తూ, తరచూ కలిసి సినిమాలకు, బయట రెస్టారెంట్లకు వెళ్లేవారమని ఆయన నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
కేవలం సరదాలకే పరిమితం కాకుండా, స్కూల్ స్థాయిలోనే జగన్ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా ఉండేవని సుమంత్ పేర్కొన్నారు. అప్పట్లో జగన్(Jagan) తమ స్కూల్ హౌస్ కెప్టెన్‌గా వ్యవహరించేవారని, ప్రతి విషయంలోనూ చాలా ప్రశాంతంగా, అదే సమయంలో ఎంతో ధైర్యంగా ఉండేవారని చెప్పారు. ఆ వయసులోనే ఆయనలోని లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను అందరూ గమనించేవారమని, అప్పట్లోనే స్నేహితులంతా జగన్ భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద రాజకీయ నాయకుడవుతాడని ముందే ఊహించామని సుమంత్ వెల్లడించారు.
అయితే, కాలక్రమేణా చదువులు పూర్తయ్యాక కెరీర్ పరంగా ఇద్దరి దారులు వేర్వేరయ్యాయి. జగన్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయగా.. సుమంత్(Sumanth) సినిమాల బాట పట్టారు. ఊహించినట్టుగానే ఇద్దరూ తాము ఎంచుకున్న రంగాల్లోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజకీయాల్లోకి వచ్చాక జగన్ సీఎం కావడంతో ఆ తర్వాత ఇద్దరూ నేరుగా కలుసుకునే అవకాశం రాలేదని, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మాత్రం ఒకసారి కలిశానని సుమంత్ తెలిపారు. రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేస్తూనే.. ఆ రంగంలో ఉన్న తన మిత్రులను ఎప్పుడూ గౌరవిస్తానని ఆయన తేల్చిచెప్పారు. మొత్తానికి, టాలీవుడ్ స్టార్ హీరో, మాజీ సీఎం చిన్ననాటి దోస్తులనే విషయం ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.