సోషల్ మీడియా పుణ్యమా అని అబద్ధాలు నిజాలుగా.. నిజాలు అబద్ధాలుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అలా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. కొన్ని అబద్ధాలు.. అందమైన నిజాలుగా మారిపోయి.. అసలు విషయాలు తెలియని ప్రజలు అబద్ధాలనే నమ్మేసే దుస్థితిని తీసుకొస్తోంది సోషల్ మీడియా. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. దారిన పోయే దానయ్య కాస్తంత బురద వేస్తే.. ఆ బురదను తుడుచుకొని.. అందులో తన తప్పు లేదని వివరించాల్సిన పరిస్థితి దాపురించింది. సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రముఖులు.. ఉన్నత స్థానాల్లో ఉన్నోళ్లు తరచూ వివరణలకే వారి సమయం సరిపోతోంది. ఇదంతా ఎందుకంటే.. గడిచిన కొన్ని రోజులుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెరువు స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు.. పోస్టులు పెట్టేస్తున్న పరిస్థితి.
నిజానికి పవన్ కల్యాణ్ మైండ్ సెట్ తెలిసినోళ్లు.. ఆయన తీరు గురించి కించిత్ అవగాహన ఉన్న వారెవరైనా సరే.. ఇలాంటివి నమ్మరు. అవసరమైతే తన డబ్బుల్ని ఎదుటోళ్లకు ఇచ్చేందుకు వెనుకాడని ఆయన వ్యక్తిత్వం ఒక ఎత్తు అయితే.. ఎన్నో సందర్భాల్లో ఆయన బ్యాంక్ బ్యాలెన్సులు కనీస స్థాయికి పడిపోయినా వెనక్కి తగ్గని తీరు ఆయన సొంతం. అయినప్పటికి.. ఆయన రాజకీయాల్లో ఉండటంతో ప్యాకేజ్ స్టార్ అన్న ముద్రను వేసి.. దాన్ని నిజమని నమ్మేలా చేసిన ప్రయత్నాల్ని మర్చిపోలేం.
ఇదంతా ఎందుకు చెప్పాల్సిన వస్తోందంటే.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ఏదోలా డ్యామేజ్ చేయాలన్న కుట్ర తరచూ జరుగుతూ ఉంటుంది. అందుకు వందలాది మంది ప్రత్యక్షంగా పని చేస్తుంటే.. ఆయన రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న వేలాది మంది తమ మెదళ్లకు పని చెబుతూ.. ఆయన మీద సరికొత్తగా బురద జల్లేందుకు ఉన్న అవకాశాల్ని వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో వాస్తవాల్ని కాస్తంత మార్చి తమకు అనుకూలమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.
పవన్ కల్యాణ్ కు వ్యవసాయం చేయటమన్నా.. మొక్కలు పెంచటమన్నా చాలా ఇష్టమన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయనకు కాస్తంత సమయం చిక్కితే.. తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకోవటం ఇష్టం. అదే సమయంలో చట్ట విరుద్ధమైన పనులకు పవన్ కల్యాణ్ దూరంగా ఉంటారు. ఒకవేళ తెలియక ఆయన ఏదైనా తప్పు చేస్తే.. అది తప్పని తెలిస్తే వెంటనే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆయన కొన్న భూమి.. చట్టబద్ధమైనది కాదని తెలిస్తే.. మరుక్షణం అదెంత విలువైనదన్న విషయాన్ని పట్టించుకోకుండా వదిలేయటానికి వెనుకాడరు. దాని కారణంగా కోట్లాది రూపాయిల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిసినా లెక్క చేయరు. అలాంటి వ్యక్తిత్వం పవన్ సొంతం.
అలాంటి పవన్ మీద.. చెరువు భూమి కొన్నారని.. ఆయన చెరువు భూమిని కొనుగోలు చేశారంటూ ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెండు..మూడుసార్లు స్పష్టం ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదని. అయినప్పటికి.. సోషల్ మీడియాలో పవన్ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆగలేదు సరికదా.. హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెప్పిన మాటల్ని సైతం వక్రీకరించి.. తమకు అనుకూలంగా.. పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వాస్తవాల్ని వక్రీకరిస్తున్న పరిస్థితి.
ఇలాంటి వేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు పలు అంశాల మీద ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన హైడ్రా కమిషనర్.. పవన్ కల్యాణ్ భూమికి సంబంధించిన ప్రశ్నకు సూటిగా.. స్పష్టంగా సమాధానం ఇచ్చేశారు. అంతేకాదు.. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుగా ప్రచారం చేస్తున్న తీరును ప్రస్తావించటం గమనార్హం. తాజాగా పవన్ కల్యాణ్ భూమి మీద హైడ్రా కమిషనర్ ఏం చెప్పారన్నది చూస్తే.. కోడి చెరువు ఎఫ్ టీఎల్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనుగోలు చేసిన పది ఎకరాలు ప్రైవేటు భూమి అని స్పష్టం చేశారు. అది క్లియర గా పట్టా భూమిగా తేల్చేశారు.
అంతేకాదు.. పవన్ కొన్న పది ఎకరాల ప్రైవేటు భూమితో పాటు.. చెరువును ఎక్కడా డిస్టర్బ్ చేయలేదన్నారు. అయితే.. పవన్ కల్యాణ్ భూములకు పక్కన భూములు ఉన్న కొందరు మాత్రం మట్టి పోసి ఎత్తు పెంచారని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ భూమిలో మాత్రం చెరువు (ఎఫ్ టీఎల్) యథాతధంగా ఉందని.. వరద నీరు వస్తోందని చెప్పారు. వరద నీరు వచ్చిన సందర్భంగా భూమి హద్దుల లెక్క తేల్చేందుకు వీలుగా ఫెన్సింగ్ వేశారన్నారు. ఆ ఫెన్సింగ్ కూడా వరద ప్రవాహానికి అడ్డుగా లేదన్నారు. అయితే.. ఆ ఫెన్సింగ్ తొలగించాలని కోరినట్లుగా వివరించారు.
చెరువుల్లో ప్రైవేటు పట్టా భూములు ఉంటాయని.. అయితే.. బ్లాక్ మొయిలింగ్ కు పాల్పడే కొందరు సోషల్ మీడియా వాళ్లు తమ వ్యక్తిగత దురుద్దేశాలతో కొన్ని పనులు చేస్తుంటారని.. అలాంటి వాటిని హైడ్రా పరిగణలోకి తీసుకోదన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను మాత్రమే చట్టప్రకారం తీసుకొని స్పందిస్తామని స్పష్టత ఇచ్చారు. ఇకనైనా పవన్ కల్యాణ్ భూమికి సంబంధించిన తప్పుడు ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడతాయా? లేదంటే.. అలానే కొనసాగుతాయా? అన్నది చూడాలి.