ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల విషయమై తమిళ ఫిలిం ఇండస్ట్రీల్లో పెద్ద వివాదమే నడిచింది. స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన రాయన్‌ను ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా ఎంపిక చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు. కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన మెయ్యళగన్ దీని కంటే ఎన్నో రెట్లు గొప్ప సినిమా అని.. అది కాదంటే విజయ్ సేతుపతి చిత్రం మహారాజకు అవార్డు ఇవ్వాలని.. అలాంటి గొప్ప సినిమాలుండగా, వాటిని కాదని రాయన్ మూవీకి అవార్డు ఎలా ఇస్తారని చాలామంది విమర్శించారు.
ఈ మూడు చిత్రాలు తెలుగులోనూ అనువాదమై రిలీజైన నేపథ్యంలో మనవాళ్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి విమర్శలు వచ్చినపుడు.. అవార్డులు అందుకున్న వాళ్లు స్పందించరు. మౌనం వహిస్తారు. కానీ ధనుష్ మాత్రం తన సినిమాకు అవార్డు ఇవ్వడంపై వచ్చిన విమర్శలపై ఓపెన్‌గా మాట్లాడాడు.
రాయన్ కంటే మెయ్యళగన్, మహారాజ మంచి సినిమాలు అనే విషయాన్ని తాను కూడా అంగీకరిస్తానని ధనుష్ పేర్కొనడం విశేషం. ఐతే తాను ఒకప్పుడు చేసిన పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్, మరియన్, రాన్‌జానా.. ఈ సినిమాలన్నీ కూడా జాతీయ అవార్డు పొందాల్సిన అర్హత ఉన్నవే అని.. కానీ అప్పుడు ఎవ్వరూ గళం వినిపించలేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సినిమాలకు తనకు అవార్డ్ వస్తుందని చాలామంది అన్నారని, కానీ అలా జరగలేదని ధనుష్ అన్నాడు.
ఇప్పుడు రాయన్‌కు నేషనల్ అవార్డు రావడాన్ని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని.. కానీ పైన చెప్పిన సినిమాలకు అవార్డు రాకపోవడంపై అప్పట్లో పది శాతం మంది కూడా మాట్లాడలేదని అతనన్నాడు. వీలైతే వెన్ను తట్టి ప్రోత్సహించాలి తప్ప, వెన్ను పట్టి నెట్టేయకూడదు అంటూ అతను వ్యాఖ్యానించడం గమనార్హం. ఐతే ఆ టైంలో అర్హత ఉన్న సినిమాలకు అవార్డులు రానంత మాత్రాన ఇప్పుడు అర్హత లేని చిత్రానికి పురస్కారం దక్కడం న్యాయమే అన్న వాదనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం లాజిక్ అంటూ అతణ్ని తప్పుబడుతున్నారు.