ప్రతి రెండు మాసాలకు ఒకసారి ఏపీ కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల చదువు, వారి భవిష్యత్తు, ఫీడ్ బ్యాక్ సహా పాఠశాలల అభివృద్ధి వంటి కీలక అంశాలపై టీచర్లు-ఉపాధ్యాయులు-స్థానిక ప్రజాప్రతినిధులు చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా అన్ని పార్టీల నాయకులు కూడా పాల్గొంటున్నారు. తాజాగా శుక్రవారం నిర్వహించిన మెగా టీచర్-పేరెంట్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు సంయుక్తంగా పాల్గొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఒక దశలో చంద్రబాబు టీచర్‌గా మారి.. సోషల్ పాఠాలు చెప్పారు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం పోలవరం జిల్లాలో ఉండడంతో పదో తరగతి విద్యార్థులను పోల వరం ప్రాజెక్టుపై పలు ప్రశ్నలు అడిగారు. అయితే.. కొందరు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో చంద్రబాబే పోలవరం ప్రాధాన్యం.. ఈ ప్రాజెక్టు నిర్మాణం.. దీనివల్ల ఒనగూరే ప్రయోజనాలు వంటివాటిని వివరించారు.
ఇలా.. పిల్లలతో మమేకమైన చంద్రబాబు, లోకేష్‌లు.. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేశారు. అయితే.. ఇక్కడే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గతంలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశాల్లోనూ చంద్రబాబు, లోకేష్‌లు మధ్యాహ్న భోజనం చేశారు. అయితే.. అప్పట్లో వైసీపీనాయకులు వీటిని ట్రోల్స్ చేశారు. ``చేతిలో పళ్లాలు ఉన్నాయి కానీ, పళ్లాల్లో పదార్థాలు లేకుండానే చంద్రబాబు భోజనం చేశారు`` అంటూ వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. వీటికి సంబంధించిన వీడియోలను కూడా పోస్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
పిల్లలతో కలిసి భోజనానికి కూర్చున్న సమయంలో ముందుగానే పళ్లేలను తెప్పించి.. వాటిలో అన్నం, ఎగ్ కర్రీ వంటివాటిని మీడియాకు కనిపించేలా వడ్డించుకున్నారు. మంత్రి లోకేష్ కూడా ఇలానే చేశారు. వీడియోలలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపించిం ది. తమ చేతుల్లోని పళ్లాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వడ్డించుకున్న దృశ్యాలు, పప్పు, ఎగ్ కర్రీలను లోకేష్ చేత్తో కలుపుకొని తిన్న దృశ్యాలతోపాటు చంద్రబాబు సైతం ఎగ్ కర్రీని ఆసక్తిగా చెంచాతో తిన్న దృశ్యం కూడా కనిపించింది. తద్వారా వైసీపీ చేస్తున్న ట్రోల్స్‌కు పరోక్షంగా ఆయన చెక్ పెట్టారు. ఈ దృశ్యాలు స్పష్టంగా చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు.. మధ్యాహ్న భోజనం చేస్తున్నారని చెప్పడానికి నిదర్శనంగా ఉన్నాయి.