ఉత్తరాంధ్ర రాజకీయంలో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ(YSRCP) సీనియర్ నేత, రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు న్యాయస్థానంలో తీవ్ర నిరాశ ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఓ భూ వ్యవహారంలో నమోదైన కేసును కొట్టేయాలంటూ (క్వాష్ పిటిషన్) వారు దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పైగా, ఈ దశలో పోలీసుల అరెస్ట్ నుంచి ఎలాంటి రక్షణ లేదా మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమని స్పష్టం చేయడంతో తమ్మినేని వర్గంలో తీవ్ర కలకలం రేగుతోంది.
అసలేం జరిగింది?
శ్రీకాకుళం(Srikakulam) సమీపంలోని చాపరం పంచాయతీ పరిధిలో సుమారు రూ. 4 కోట్ల విలువైన 900 గజాల విలువైన భూమిపై ఈ వివాదం నడుస్తోంది. సదరు స్థల యజమాని బతికుండగానే.. ఆయన మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి, దొంగ పత్రాల ద్వారా ఆ ఆస్తిని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారనేది ప్రధాన ఆరోపణ. బాధితుడు కట్టా జయకిషోర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ హైప్రొఫైల్ కేసులో పోలీసులు ఇప్పటివరకు 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఇప్పటికే 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ వై. లక్ష్మణరావు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్ కావాలనుకుంటే దానికి తగిన పిటిషన్ వేసుకోవచ్చని సూచిస్తూ, తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది.
కోర్టు తీర్పు వెలువడిన మరుక్షణమే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆమదాలవలసలోని తమ నివాసం నుంచి తమ్మినేని సీతారాం(Tammineni Sitaram), ఆయన భార్య వాణి, కుమారుడు నాగ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ స్పీకర్ అరెస్ట్ ముంగిట నిలబడ్డారా అనే చర్చ జోరుగా సాగుతోంది.