ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు ఎన్నో హామీలిస్తుంటారు. అయితే, ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటిని చాలామంది మరచిపోతుంటారు. కానీ, మంత్రి నారా లోకేశ్ వంటి నేతలు మాత్రం ఇచ్చిన మాట మరువరు. చెప్పింది చేస్తారు. ఆ క్రమంలోనే ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని లోకేశ్ ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు. ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమంలో తొలిరోజు 1331 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను లోకేశ్ అందజేశారు.
మామూలుగా అయితే, కొన్ని పట్టాలు పంపిణీ చేసిన తర్వాత రాజకీయ నేతలు వెళ్లిపోతారు. మిగతా పట్టాలను స్థానిక నాయకులు, అధికారులు పంపిణీ చేస్తారు. కానీ, లోకేశ్ మంత్రి హోదాలో ఉండి కూడా అలా చేయలేదు. ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నాన్ స్టాప్ గా నిలబడే పట్టాలు పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి స్వయంగా పట్టాలు అందించి వారి కళ్లల్లో ఆనందాన్ని స్వయంగా చూడాలన్నదే లోకేశ్ ఉద్దేశ్యం. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సొంత ఇంటి కలను నెరవేర్చిన లోకేశ్ కు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇళ్ల పట్టా పత్రాలతో పాటు లబ్ధిదారులందరికీ నూతన వస్త్రాలను కూడా లోకేశ్ బహూకరించారు. తమను తన కుటుంబ సభ్యులుగా భావించి కొత్త బట్టలు పెట్టి మరీ కొత్త ఇంటి పట్టాలు ఇచ్చిన లోకేశ్ కు లబ్ధిదారులు భావోద్వేగంతో ధన్యవాదాలు తెలిపారు. మంత్రి అయినా సరే బిజీ షెడ్యూల్ ను పక్కనబెట్టి మరీ ఓపికగా ఏడున్నర గంటలపాటు నాన్ స్టాప్ గా పట్టాలు పంపిణీ చేసిన లోకేశ్ పై ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.