టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రమాదానికి గురయ్యారనే వార్త సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఒక్కసారిగా కలకలం రేపింది. కాకినాడ పోర్ట్ లో NBK111లోని ఓ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఒక కీలకమైన సన్నివేశాన్ని తీస్తున్న సమయంలో బాలయ్య ఊహించని విధంగా జారిపడటంతో ఆయన మోకాలి భాగంలో తీవ్ర గాయమైంది.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం చిత్రీకరణను నిలిపివేసి, బాలయ్య(Balayya)ను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన డాక్టర్లు, గాయం యొక్క తీవ్రతను స్పష్టంగా తెలుసుకునేందుకు మోకాలికి ప్రత్యేక స్కానింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కోసం చిత్ర యూనిట్ సహా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ (NBK111) ఇటీవల ముంబై, హైదరాబాద్ షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, కథానాయిక కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అయితే, బాలయ్య ప్రమాదానికి గురికావడంతో.. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్ స్పాట్‌లోకి అడుగుపెట్టాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.