వైసీపీ ఎంపీలు మారలేదు!

admin
Published by Admin — July 20, 2026 in Politics
News Image

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 19 రోజుల పాటు నిర్వ‌హించే ఈ స‌మా వేశాలు... ఆగ‌స్టు 13వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. అయితే.. సంప్ర‌దాయం ప్ర‌కారం.. స‌భ‌ల‌కు ముందు రోజు నిర్వ‌హించే అఖిల ప‌క్ష స‌మావేశం.. ఆదివారం ఢిల్లీలోనిపాత పార్ల‌మెంటు భ‌వ‌నంలో జ‌రిగింది. అయితే.. చిత్రంగా ఈ స‌మావేశ‌మే రాజ‌కీయ సెగ‌ల‌కు.. కాక‌ల‌కు కేంద్రంగా మారింది. వాస్త‌వ స‌మావేశాల‌ను స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని.. అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుతూ నిర్వ‌హించిన అఖిల ప‌క్ష స‌మావేశ‌మే ర‌సాభాస‌గా ముగిసింది. ప‌లు పార్టీల ఫ్లోర్ లీడ‌ర్లు వాకౌట్ చేసి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

స‌హ‌జంగానే స‌భ‌ల‌ను స‌జావుగా నడిపించేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్షాల‌కు విన్న‌విస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, కిరెణ్ రిజుజు, జేపీ న‌డ్డా వంటివారి స‌మ‌క్షంలో కాంగ్రెస్, ఎస్పీ, తృణ‌మూల్ కాంగ్రెస్‌, డీఎంకే, వైసీపీ వంటి దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెం టులో భాగ‌స్వామ్యం ఉన్న ప్ర‌తిప‌క్ష పార్టీల ఫ్లోర్ లీడ‌ర్ల‌ను ఆహ్వానించారు. అయితే.. ఈ భేటీలోనే ప్ర‌భుత్వ విధానాల‌ను.. ఎండ గడుతూ.. ప్ర‌తిప‌క్ష ఫ్లోర్ లీడ‌ర్లు స‌మావేశాన్ని బాయ్‌కాట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఒక్క వైసీపీ త‌ప్ప‌.. దాదాపు ఇత‌ర ప‌క్షాల‌న్నీ ఈ స‌మావేశాన్ని బాయికాట్ చేసి బ‌య‌ట‌కు రావ‌డంతో స‌మావేశం గంద‌ర‌గోళంగా మారింది.

ఎందుకు?

స‌మావేశంలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న బిల్లుల‌కు ఆమోదం తెల‌పాల‌ని మంత్రులు కోరారు. అయితే.. తాము సూచించిన మేర‌కు మార్పులు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష ఫ్లోర్‌లీడ‌ర్లు తెలిపారు. మార్పు చేస్తామ‌ని చెబుతూ నే.. ముందుగా దానికి సంబంధించిన స‌మాచారం ఇవ్వ‌లేమ‌ని మంత్రులు చెప్ప‌డంతో ప్ర‌తిప‌క్షాలు వెనుదిరిగాయి. ఇక‌, ఇటీవ‌ల కాలంలో కొన్ని పార్టీల‌కు చెందిన ఎంపీలు బీజేపీకి అనుకూలంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారికి కూడాఈ స‌మావేశంలో ప్రాధాన్యం ఇవ్వ‌డంతో .. స‌ద‌రు పార్టీలు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. త‌మ‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూ.. తిరుగుబాటు జెండా ఎగుర‌వేసిన ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. వారిని అఖిల ప‌క్ష స‌మావేశానికి ఆహ్వానించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.

ఇలా.. ప్ర‌తిప‌క్షాల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డంతో ఒకానొక ద‌శ‌లో మంత్రులు కొంత స‌ర్దుబాటు చేసేందుకు ప్ర‌య‌త్నించినా.. కాంగ్రెస్ స‌హా తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఎస్పీల నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ప్ర‌ధాని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అలానే ఇప్ప‌టికే ఆమోదించిన మ‌హిళా బిల్లును పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల బిల్లుతో ముడి పెట్ట‌డాన్ని వారు త‌ప్పుబ‌ట్టారు. సో.. మొత్తంగా పార్ల‌మెంటు ప్రారంభానికి ముందే.. రాజ‌కీయంగా వేడెక్క‌డం గ‌మ‌నార్హం. ఇక‌, సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యే స‌మావేశాలు ఏ రేంజ్‌లో జ‌రుగుతాయో.. మాట‌ల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో అర్థ‌మ‌వుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Tags
Ycp mp's still loyal to nda alliance national level
Recent Comments
Leave a Comment

Related News