ఆరుగురు కూర్చుంటే ముచ్చట.. రాజకీయ నేతలు కూర్చుంటే వ్యూహం. తాజాగా ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీడియా ప్రతినిధులతో జరిపిన 'చిట్‌చాట్' ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసల్లో ముంచెత్తిన కేటీఆర్.. అదే సమయంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. ఏపీ పాలనను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి నేర్చుకోవాలంటూ చురకలు అంటించారు.
రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం, రైతాంగానికి నీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టిందని కేటీఆర్ కొనియాడారు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ రాజకీయాలకు తావివ్వకుండా, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతులకు అండగా నిలవడాన్ని ఆయన అభినందించారు. సముద్రంలో వృథాగా పోయే గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం శ్రమిస్తోందని చెప్పారు. కానీ, తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్న కేటీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులో ఉన్నప్పటికీ, నీటిని ఎత్తిపోయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంటలను ఎండబెడుతోందని మండిపడ్డారు.
కేంద్రంలో మారిన రాజకీయ సమీకరణాలను కేటీఆర్ ఈ సందర్భంగా విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం టీడీపీ(TDP) మద్దతుపై ఆధారపడి నడుస్తోందని, ఆ బలం వల్లే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా ఏపీ నిలబెట్టుకోగలిగిందని గుర్తుచేశారు. గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని, 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ తాము కూడా మద్దతు ప్రకటించామని చెప్పారు. ప్రస్తుతం ఆ పరిశ్రమ మళ్లీ గాడిన పడటం సంతోషకరమన్నారు. అయితే, ఇదే తరహాలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ని పునరుద్ధరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడం వల్లే ఇప్పుడు తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఏపీకి జరుగుతున్న మేలును చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 15 లోక్‌సభ స్థానాలను అందిస్తే.. కేంద్రంలో చక్రం తిప్పడమే కాదు, ఢిల్లీ పెద్దలే మన కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఒకవైపు ఏపీ ప్రభుత్వ వ్యూహాత్మక అడుగులను మెచ్చుకుంటూనే.. మరోవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంత అవసరమో కేటీఆర్ ఈ చిట్‌చాట్ ద్వారా స్పష్టం చేశారు.