ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయంలో సుదీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న అమరావతి అసైన్డ్ భూముల వివాదానికి తెరపడింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన సీఐడీ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండానే ఈ కేసు నమోదు చేశారంటూ కోర్టు స్పష్టం చేయడంతో.. కూటమి ప్రభుత్వానికి నైతికంగా భారీ విజయం దక్కినట్లయింది. ఈ తీర్పుతో అటు అధికార వర్గాల్లోనూ, ఇటు తెలుగుదేశం శ్రేణుల్లోనూ ఒక్కసారిగా జోష్ పెరిగింది.
గత వైసీపీ పాలనలో టీడీపీ(TDP) అగ్రనేతలను టార్గెట్ చేస్తూ అనేక కేసులు నమోదయ్యాయి. అందులో భాగమే అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు అని మొదటి నుంచీ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. 2021లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే చంద్రబాబు, నారాయణలపై సీఐడీ అధికారులు అత్యంత వేగంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులను బనాయించారు. అయితే, ఇదంతా కేవలం రాజకీయ ప్రతీకార చర్యేనని నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ బలంగా వాదించింది.
సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆరోపణలు చేసిన వారికి కోలుకోలేని దెబ్బ తీసింది. పిటిషనర్ సమర్పించిన వివరాల్లో ఎక్కడా సరైన సాక్ష్యాధారాలు లేవని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బురదజల్లే ప్రయత్నం చేశారన్న వాదనకు బలాన్ని చేకూరుస్తూ.. సీఐడీ(CID) కేసును పూర్తిగా కొట్టివేసింది. దీంతో రాజధాని భూముల వ్యవహారంలో చంద్రబాబు సర్కార్ పూర్తి క్లీన్ చిట్‌తో బయటపడినట్లయింది.
ఈ చారిత్రాత్మక తీర్పుపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. "నిజం నిలకడ మీద తెలుస్తుంది" అనడానికి ఈ తీర్పే నిదర్శనమని, వైసీపీ ఆడిన మైండ్ గేమ్‌కు హైకోర్టు చెక్ పెట్టిందని టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను గందరగోళానికి గురిచేయడానికి వేసిన ఎత్తుగడలు చివరకు బెడిసికొట్టాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ కోర్టు తీర్పుతో ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష వైసీపీ డిఫెన్స్‌లో పడగా, చంద్రబాబు(Chandrababu) సర్కార్ మరో మెట్టు పైకెక్కింది.