టాలీవుడ్(Tollywood) ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక, న్యాయ వివాదం ముసురుకుంది. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్(Union Bank) తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇప్పటికే తాము బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద భారీగా చెల్లించినప్పటికీ, తమ సొంత ఆస్తులను వేలం వేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినీ, వ్యాపార వర్గాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు యూనియన్ బ్యాంక్ ఇచ్చిన రుణాలకు గానూ.. బండ్ల గణేష్(Bandla Ganesh), ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టారు. అయితే, కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న సమయంలో బ్యాంక్ ఆ తాకట్టు ఆస్తులను వేలానికి ఉంచింది. ఈ చర్యను సవాలు చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఒక సంచలన విషయాన్ని పేర్కొన్నారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద తాము ఇప్పటికే రూ. 71.44 కోట్లతో కలిపి మొత్తంగా సుమారు రూ. 129.02 కోట్లను బ్యాంకుకు చెల్లించామని, బకాయిలన్నీ తీరిపోయిన తర్వాత కూడా తమ ఆస్తులను వేలం వేయడం అన్యాయమని ఆయన వాదిస్తున్నారు.
ఈ వేలం ప్రక్రియపై బండ్ల గణేష్ మొదట రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (DRT)ని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించింది. బ్యాంక్ జరిపిన వేలాన్ని రద్దు చేసిన ట్రిబ్యునల్.. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి యజమానులకు అప్పగించాలని, కొనుగోలుదారుకు వడ్డీతో సహా డబ్బులు వాపసు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టుకు వెళ్లగా.. అక్కడ సీన్ రివర్స్ అయింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేస్తూ, బ్యాంక్ చర్యలను హైకోర్టు సమర్థించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ ఇప్పుడు సుప్రీంకోర్టులో తుది పోరాటానికి దిగారు.
ఈ హై-ప్రొఫైల్ కేసు వచ్చే సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా తాము బ్యాంకుకు చెల్లించాల్సినవన్నీ చెల్లించినా ఆస్తులు వేలం వేయడంపై బండ్ల గణేష్ న్యాయపోరాటం చేస్తుండటంతో, దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అటు బ్యాంకింగ్ రంగంలోనూ ఉత్కంఠ రేపుతోంది.