తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో రెండు గంటల వ్యవధిలో ఆరు హత్యలు చేసి సంచలనం సృష్టించిన నరహంతకుడు రాజ్ కుమార్.. ఈ దారుణానికి ఒడిగట్టిన మూడు రోజులకు కూడా పోలీసులకు దొరక్కపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను ఆత్మహత్యకు పాల్పడి ఉన్నా సరే.. ఇప్పటిదాకా శవం దొరకలేదు. ఐతే పోలీసుల సమాచారం ప్రకారం అతను ఈ హత్యల అనంతరం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు. కానీ చివరి క్షణాల్లో ట్రాక్ నుంచి తప్పుకున్నట్లుగా సీసీటీవీ దృశ్యాలు నిర్ధారించాయి. మరి తర్వాత అతను ఏమయ్యాడన్నది తెలియడం లేదు. ఐతే సోమవారం ఉదయం సూర్యాపేటకు చెందిన ఒక మహిళ రాజ్ కుమార్ తమ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే సూర్యాపేట ఎస్పీ నేతృత్వంలో ఒక బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. తీరా చూస్తే అక్కడున్నది రాజ్ కుమార్ కాదని, అతడిలా ఉన్న మరో కుర్రాడిని చూసి ఆ మహిళ పొరపడిందని తేలింది.
రాజ్ కుమార్ ఆచూకీ కోసం మూడు రోజులుగా 15 బృందాలు గాలిస్తున్నా ఇప్పటికీ అతణ్ని కనుక్కోలేకపోయారు. రహస్య ప్రదేశంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదా.. రాష్ట్రం విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవడం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తన పక్కింట్లోనే ఉండే బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డందుకు తన మీద పోక్సో కేసు పెట్టారన్న కారణంతో ఆ అమ్మాయితో పాటు తన తల్లి, నానమ్మను శుక్రవారం రాత్రి చంపేసిన రాజ్ కుమార్.. కాసేపటికే తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా హత్య చేశాడు. రాజ్ కుమార్ బెట్టింగ్ సహా పలు వ్యసనాలతో రూ.2 కోట్ల దాకా అప్పు చేశాడని.. తల్లిదండ్రులు పొలం అమ్మి మరీ అప్పులు తీర్చారని.. ఇలాంటి టైంలో తనను కేసు పెట్టి జైలుపాలు చేయడంతో పక్కింటి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడని.. మరోవైపు తన ప్రవర్తన నచ్చని భార్య కొంత కాలంగా విడాకులు అడుగుతుండడంతో ఆమెతో పాటు పిల్లల్ని కూడా ఒకేసారి చంపాలని నిర్ణయించుకున్నాడని.. పథకం ప్రకారం ఆరుగురినీ చంపేశాడని భావిస్తున్నారు. కొన్ని నెలల ముందు బాధిత బాలిక తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించగా.. దాని వెనుకా రాజ్ కుమార్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.