జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని, ఆయన ద్వారా భారీ మార్పులు జరుగుతాయని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. వాస్తవానికి ఇలాంటి చర్చ వచ్చినప్పుడు తారక్.. స్పందిస్తూ.. తనకు సినిమాలపైనే ధ్యాస ఉందని, తాను రాజకీయాల్లోకి రావడం లేదని చెబుతున్నారు. తాజాగా ఈ నెల 18న భారీ ప్రకటన చేస్తారంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపైనా స్పందిం చారు.
ఇదిలావుంటే.. అసలు ఇప్పుడున్న పరిస్థితిలో తారక్ ఏమేరకు రాజకీయాలను ప్రభావితం చేస్తారన్నది ప్రశ్న. ఓటు బ్యాంకు పరంగా.. నిర్దిష్ట స్థాయిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. దీనిని కదల్చడం.. తనవైపు తిప్పుకొవడం వంటివి చేయాలంటే.. తారక్‌కు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ వంటి బలమైన పార్టీలను పక్కన పెట్టి.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆయన సాహసం చూపించినా.. ప్రజలేమేరకు దీనిని స్వాగతిస్తారన్నది ప్రశ్న.
ఎన్టీఆర్ హవా..
ఎన్టీఆర్ హవా ఆనాడు ఏ పార్టీ పెద్దగా బలంగా లేని రోజుల్లో సాగింది. పైగా కమ్యూనిస్టులు కలిసి వచ్చారు. కానీ, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బలోపేతం అయ్యాయి. పైగాకులాల వారీగా కొన్ని చోట్ల మతాల వారీగా కూడా పార్టీలు చీలిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తారక్ ఎంట్రీ ఇచ్చి.. వీరిని ఐక్యం చేయడం అంటే.. సాధ్యం కాదన్నది కొందరి అభిప్రాయం. అయితే.. యువతను ఆయన లీడ్ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది.
ఇది ఏమేరకు చేస్తారన్నది ప్రశ్న. మరోవైపు.. ప్రస్తుతం రాజధాని, పోలవరం, మూడు ప్రాంతాల అభివృద్ధి, కేంద్రంతో సమన్వయం ఇలా అనేక సమస్యలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో తారక్ వంటి కొత్త నేతలను ప్రజలు ఆదరిస్తారా? అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. అయితే.. తారక్ ఎంట్రీవెనుక బీజేపీ ఉందన్న ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, దీనిపైనా స్పష్టత లేదు.
ఎప్పుడో ఒకసారి.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో తారక్ భేటీ అయినా.. అది సినిమా పరంగానేనన్న చర్చ వచ్చింది. పైగా.. బీజేపీ ఇప్పుడు జనసేనతో టై అప్ అయి ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. తారక్ ప్రస్తావన, రాజకీయాల్లోకి ఎంట్రీ అనేది ప్రస్తుతం టైంపాస్ కోసమేనన్న వాదన వినిపిస్తోంది.