పొలిటిక‌ల్ ఎంట్రీ.. ఎన్టీఆర్ ముందున్న స‌వాళ్లు ఇవే..!

admin
Published by Admin — July 14, 2026 in Politics, Andhra
News Image

టాలీవుడ్‌(Tollywood)లో తన నటనతో, డైలాగ్ డెలివరీతో కోట్ల మంది గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఆయన కాలు మోపితే సమీకరణాలు మారిపోతాయని కొందరు, అసలు ఈ బురద గుంటలోకి ఆయన రాకపోవడమే మంచిదని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే, ఒకవేళ తారక్ గనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తే.. ఆయన ముందు ఎలాంటి సవాళ్లు ఉన్నాయి? మారుతున్న కాలంతో పాటు మారిన రాజకీయ పరిస్థితులు ఆయనకు ఎంతవరకు నప్పవు? అనే కోణంలో విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.

ఒకప్పుడు రాజకీయాలంటే సిద్ధాంతాల పోరాటం. పార్టీలు వేరైనా నాయకుల మధ్య పరస్పర గౌరవం, ఒక సంస్కృతి ఉండేవి. సొంత తెలుగువాడు దేశ ప్రధాని అవుతుంటే (పీవీ నరసింహారావు) ఏకగ్రీవానికి సహకరించిన మహోన్నత సాంప్రదాయం పెద్ద ఎన్టీఆర్ కాలంలో చూశాం. కానీ, నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయి. వ్యక్తిగత దూషణలు, బూతులు, క్యారెక్టర్ అస్సాసినేషన్ సర్వసాధారణమైపోయాయి. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత సైతం కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అత్యంత సున్నిత మనస్కుడు, ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిచ్చే తారక్.. ఇలాంటి కలుషిత వాతావరణాన్ని తట్టుకుని నిలబడడం ఒక పెద్ద సవాలే.

అలాగే ప్రస్తుత రోజుల్లో ఓటర్లు కేవలం పార్టీల వైపు మాత్రమే చూడడం లేదు. కులాలు, మతాలు, ప్రాంతాల ప్రాతిపదికన ఓటు బ్యాంకు ఘోరంగా చీలిపోయి ఉంది. ఒక సినిమా హీరోగా అన్ని వర్గాల ప్రజలు తారక్‌ను ఆదరిస్తారు. కానీ, పొలిటికల్ స్క్రీన్‌పైకి రాగానే అదే ఇమేజ్ కులాల రంగు పులుముకుంటుంది. ఒక నిర్దిష్ట వర్గానికి ఆయనను పరిమితం చేసేందుకు ప్రత్యర్థులు క్షణాల్లో వ్యూహాలు రచిస్తారు. ఈ కుల సమీకరణాలను చేధించి, తటస్థ ఓటర్లను తనవైపు తిప్పుకోవడం.. అందరినీ ఏకం చేయడం తారక్‌(Tarak)కు పెను సవాలుగా మారే అవకాశం ఉంది.

సినిమాల్లో సక్సెస్ కావడం వేరు, రాజకీయాల్లో నెగ్గుకురావడం వేరు. వెండితెరపై డైలాగులు చెబితే విజిల్స్ పడతాయి కానీ, రియల్ లైఫ్‌లో ప్రతి రోజూ ప్రజల్లో ఉంటూ, క్షేత్రస్థాయి సమస్యలపై పోరాడాలి. 'ఊరూ-వాడా' వంటి కార్యక్రమాలపై ఎలాంటి రూమర్స్ వచ్చినా, నిజంగానే రేపు పొద్దున జనంలోకి వెళ్లాల్సి వస్తే.. సినిమా షూటింగులు వదులుకుని పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవైపు పీక్‌లో ఉన్న సినీ కెరీర్, మరోవైపు నిరంతరం అగ్నిపరీక్ష పెట్టే రాజకీయం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం తారక్ ముందున్న అసలైన టాస్క్. మ‌రి ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఎన్టీఆర్(NTR) సృష్టించుకోగలరా లేదా అనేది కాలమే నిర్ణయించాలి

Tags
Jr NTR NTR Political Entry Maa Ooru Vada Ooru Vaada Tarak AP Politics
Recent Comments
Leave a Comment

Related News