ప్రశాంత్ కిషోర్ ఆస్తుల చిట్టా.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

admin
Published by Admin — July 14, 2026 in Politics, National
News Image

భారత రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ఒక వెలుగు వెలిగి, ‘కింగ్‌ మేకర్’ అనే ముద్ర వేసుకున్న ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఇప్పుడు స్వయంగా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగారు. బీహార్ లోని బంకిపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, మొదటిసారిగా ఓటర్ల ముందుకు ప్రత్యక్షంగా వస్తున్న పీకే.. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ లోని ఆస్తుల వివరాలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపాయి. ఎందుకంటే తెరవెనుక ఉంటూ వ్యూహాలు రచించిన ఈ చాణక్యుడి దగ్గర ఉన్న సంపద కార్పొరేట్ దిగ్గజాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంది.

సాధారణంగా కుటుంబాల్లో భర్తల పేరిట ఎక్కువ ఆస్తులు ఉంటే.. పీకే ఇంట్లో మాత్రం సీన్ రివర్స్. ప్రశాంత్ కిషోర్ కంటే ఆయన భార్య డాక్టర్ జాహ్నవి దాస్(Jahanvi Das) సంపదే చాలా ఎక్కువగా ఉండడం విశేషం. న్యూఢిల్లీలోని అపోలో ఇంద్రప్రస్థ హాస్పిటల్‌లో సీనియర్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న ఆమెకు అపారమైన చరాస్తులు ఉన్నాయి. పీకేకు వ్యక్తిగతంగా 105 కోట్ల రూపాయల ఆస్తులు (చరాస్తులు, స్థిరాస్తులతో కలిపి) ఉండగా.. ఆయన సతీమణి పేరిట ఏకంగా 112 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి.

ఈ దంపతుల ఆస్తుల కలయికతో వారి కుటుంబం దాదాపు 217 కోట్ల రూపాయలకు పైగా బలమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని ఎన్నికల అఫిడవిట్ స్పష్టం చేస్తోంది. వీరితో పాటు వీరి కుమారుడు దైబిక్ భరద్వాజ్ పేరిట కూడా రూ. 7 లక్షలకు పైగా విలువైన చరాస్తులను చూపించారు. ఇక్క‌డ పీకే కుటుంబ ఆస్తులను నిశితంగా గమనిస్తే.. నగదు కంటే పెట్టుబడులు, స్థిరాస్తుల రూపంలోనే ఎక్కువ సంపద పోగైంది. ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) పేరిట రూ. 22.20 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా.. ఆయన భార్య జాహ్నవి దాస్ పేరిట అత్యధికంగా రూ. 99.52 కోట్ల చరాస్తులు (ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కన్సల్టెన్సీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో) ఉన్నాయి. పొలిటికల్ అడ్వైజర్, కన్సల్టెంట్‌గా పీకే సంపాదిస్తుండగా.. ఆయన భార్యకు వైద్య వృత్తి ద్వారా, కన్సల్టెన్సీ మరియు భారీ అద్దెల రూపంలో ఆదాయం సమకూరుతోంది.

ఇక‌ ఆస్తులు వందల కోట్లలో ఉన్నప్పటికీ.. పీకే(PK)కు రూ. 5.78 కోట్ల మేర అప్పులు ఉండగా, ఆయన భార్య పేరిట కేవలం రూ. 55.38 లక్షల అప్పు మాత్రమే ఉంది. కాగా, ఒకవైపు కొండంత ఆర్థిక బలం, మరోవైపు అపారమైన ప్రజాదరణతో ఎన్నికల బరిలోకి దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్ బయోడేటాలో కొన్ని కేసులు కూడా చోటు చేసుకున్నాయి. ఆయనపై ప్రస్తుతం 8 పెండింగ్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. అయితే ఇవి శాంతిభద్రతల సమస్యలు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, అక్రమంగా గుమికూడటం వంటి ఆరోపణలతో రాజకీయ ఆందోళనల నేపథ్యంలో నమోదైన కేసులు కావడం గమనార్హం. 

ఎన్నికల బరిలో దిగే ప్రతీ అభ్యర్థి ఆస్తులను ఆరా తీయడం ఓటర్లకు సహజమే. అయితే సామాన్యుల పక్షాన పోరాడుతున్నామంటూ బీహార్ వీధుల్లో పాదయాత్రలు చేస్తున్న పీకే వద్ద ఈ స్థాయి ఆర్థిక వనరులు ఉండటం రాజకీయ శత్రువులకు ఆయుధంగా మారుతుందా? లేక ఒక స్వతంత్ర రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు ఈ బలం ఉపయోగపడుతుందా? అనేది బంకిపూర్(Bankipur) ఓటర్లే తేల్చాలి.

Tags
Prashant Kishor Jan Suraaj Party Bankipur Bypoll Bihar Politics PK Net Worth Election Affidavit
Recent Comments
Leave a Comment

Related News