షాబాద్ 6 హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న వైనం చర్చనీయాంశమైంది. హత్యలు చేసిన తర్వాత పరారీలో ఉన్న రాజ్ కుమార్ నేడు కొత్తూరు మండలంలోని ఓ వెంచర్ వద్ద శవమై తేలాడు. మృతదేహం వద్ద విషం బాటిల్ లభ్యం కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజ్ కుమార్ మృతదేహం వద్ద స్వాధీనం చేసుకున్న అతని మొబైల్ ఫోన్‌లో రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు.
6 హత్యలకు పాల్పడటానికి ఒకరోజు ముందు ఆ వీడియోను రికార్డ్ చేసినట్లు తేలింది. తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేశారని, పోక్సో కేసుకు కారణమైన అమ్మాయి కుటుంబం తనను ఆర్థికంగా నిండా ముంచిందని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. వారి వల్ల అప్పుల పాలై ఆస్తులు కోల్పోయానని, తన పిల్లల భవిష్యత్తు నాశనమైందని వాపోయాడు. తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని, ఈ ద్రోహానికి ప్రతీకారంగానే ఈ హత్యలకు పాల్పడుతున్నానని వీడియోలో పేర్కొన్నాడు. మరోవైపు, రాజ్ కుమార్ మృతదేహాన్ని తీసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో, పోలీసులు అతడి అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది.