రేవంత్ ను తిట్టిన వైసీపీ నేతకు షాక్

admin
Published by Admin — July 13, 2026 in Telangana
News Image

 

వైసీపీ నాయ‌కుడు నాగార్జున యాద‌వ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని నాగార్జున నివాసానికి ఆదివారం సాయంత్రం వ‌చ్చిన తెలంగాణ‌లోని బేగం బ‌జార్ పోలీసులు.. ఆయ‌న కుటుంబానికి స‌మాచారం ఇచ్చి.. త‌మ వెంట యాద‌వ్‌ను తీసుకువెళ్లారు. హైద‌రాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్‌కు చెందిన కైలాష్‌ స‌జ్జ‌న్ అనే వ్య‌క్తి నాగార్జున యాద‌వ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. ముంద‌స్తుగా త‌మ‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌లేద‌ని, కేవలం తెలంగాణ పోలీసుల‌మ‌ని మాత్ర‌మే వ‌చ్చిన వారు చెప్పార‌ని నాగార్జున కుటుంబ స‌భ్యులు తెలిపారు.
 
ఎందుకీ కేసు!
 
వైసీపీ అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున యాద‌వ్‌.. సాక్షి మీడియాలో నిత్యం చ‌ర్చ‌ల‌కు వ‌స్తుంటారు. ఈ క్ర‌మంలో ఏపీలో కూట‌మి స‌ర్కారుపైనా.. అధికారుల తీరుపైనా విమ‌ర్శ‌లు చేయ‌డం కామ‌న్‌. అయితే.. అనూహ్యంగా తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై కూడా యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫిర్యాదు దారుడు కైలాష్ త‌న కంప్లెయింట్‌లో పేర్కొన్న‌ట్టుగా .. సీఎం రేవంత్‌ను `జొమాటో స్విగ్గీ డెలివ‌రీ బాయ్‌`గా ప‌దే ప‌దే విమ‌ర్శించాడు. అంతేకాదు.. `భార‌త దేశంలో అత్యంత దారుణ‌మైన సంగ‌తుల్లో ఆ డెలివ‌రీ బాయ్‌.. ముఖ్య‌మంత్రి అయ్యాడు.`` అని నాగార్జున వ్యాఖ్యానించాడు.
 
అంతేకాకుండా.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ``జీ.వో``, `మిసిల్లేనియ‌స్‌` వంటి ప‌దాల‌కు అర్ధం కానీ, ఎబ్రివేష‌న్ కానీ తెలియ‌ద‌ని కూడా నాగార్జున యాద‌వ్ వ్యాఖ్యానించిన‌ట్టు కైలాష్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో ``డెలివ‌రీ బాయ్‌ల‌తో సీఎంను పోల్చ‌డం కూడా త‌క్కువేన‌ని, దీనికి వారు చాలా బాధ‌ప‌డి ఉంటార‌ని, కాబ‌ట్టి వారికి తాను సారీ చెబుతున్నాన‌ని నాగార్జున యాద‌వ్ పేర్కొన్నారు`` అని త‌న ఫిర్యాదులో రాసుకొచ్చారు. అయితే.. ఈ చ‌ర్చ‌ల స‌మ‌యంలో యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన కొమ్మినేని శ్రీనివాస‌రావు.. నాగార్జున యాద‌వ్‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని తెలిపారు.
 
అయితే.. ఈ చ‌ర్చ‌ల తాలూకు వీడియోను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల‌లో నాగార్జున యాద‌వ్ పోస్టు చేశార‌ని, దీంతో ఈ వ్య‌వ‌హారం పై సీఎం అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా తీవ్ర మాన‌సిక ఆవేద‌నకు గుర‌య్యార‌ని కైలాష్ త‌న ఫిర్యాదులో తెలిపారు. `డెలివ‌రీ` అంటూ..ముఖ్య‌మంత్రిని వ్యాఖ్యానించ‌డం అంటే.. అది ఆ ప‌ద‌విని అగౌర‌వ ప‌ర‌చ‌డ‌మేన‌న్నారు. పైగా తెలంగాణ ప్ర‌జ‌ల సెంటిమెంటును కూడా దెబ్బ‌తీయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. బ‌హిరంగ వేదిక‌ల‌పై ఇలాంటి ప‌ద‌జాలం వినియోగించ‌డం దారుణ‌మ‌ని తెలిపారు. ప్ర‌జా ప్ర‌తినిధిని అవ‌మానించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు.
Tags
cm revanth reddy ycp leader nagarjuna yadav abuse arrested
Recent Comments
Leave a Comment

Related News