గాన కోకిల‌లో `ఆత్మ గౌర‌వ` స్వ‌రం

admin
Published by Admin — July 13, 2026 in Movies
News Image
ఒక గాత్రం ఎన్ని ర‌కాల స్వ‌రాలను ప‌లికించ‌గ‌ల‌దు? అన్న ప్ర‌శ్న‌కు... `కొన్ని మాత్ర‌మే` అని ఎంద‌రో స‌మాధానం చెబితే.. ``కాదు.. ఎన్నైనా ప‌లికించ‌గ‌ల‌ను`` అని చెప్పిన మ‌ధుర గాయ‌కురాలు డాక్ట‌ర్ ఎస్‌. జాన‌కి. చిన్న పిల్ల‌ల నుంచి క‌న్నె పిల్ల‌ల వ‌ర‌కు.. మ‌ధ్య‌వ‌య‌స్కు నుంచి వృద్ధుల వ‌ర‌కు ఎన్ని స్వ‌రాలైనా.. ఎంతో మ‌ధురంగా ప‌లికించిన కోకిల గానం.. జాన‌కి సొంతం. `మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు` సినిమాలో క‌న్నెవ‌య‌సులో ఉన్న సుహాసినికీ, వృద్ధురాలైన బామ్మ పాత్ర‌లో ఉన్న భానుమ‌తికి ఏక కాలంలో గ‌ళం విప్పిన స్వ‌ర చింతామ‌ణి జాన‌కి!.
 
ఇటు గాయ‌కురాలిగానేకాకుండా.. మ‌రోవైపు సుప్ర‌సిద్ధ సంగీత ప్ర‌పంచంలో సంప్ర‌దాయ సంగీతానికి కూడా పెద్ద‌పీట వేసిన ఘ‌న‌త జాన‌కికే ద‌క్కుతుంది. డ్యూయెట్ల నుంచి త్యాగ‌రాజ‌కీర్త‌న‌ల వ‌ర‌కు త‌న గాత్రం ప‌ల‌క‌ని గీతం లేదంటే అతిశ‌యోక్తికాదు. అయితే.. ఆమె ఎక్క‌డా డ‌బ్బు కోస‌మో.. పేరుకోస‌మో తాప‌త్ర‌య ప‌డ‌లేదు. అదేస‌మ‌యంలో రాజీ ధోర‌ణిని కూడా అవ‌లంభించ లేదు. కోకిల గానంతోపాటు ఆత్మ‌గౌర‌వ స్వ‌రాన్ని వినిపించిన గాయ‌నిగా ఆమె సుస్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. అవార్డులు ద‌క్క‌డ‌మే గొప్ప అనుకునే రోజుల్లో ప‌ద్మ‌విభూష‌ణ్ వంటి అతి పెద్ద పౌర‌పుర‌స్కారాన్ని తృణ‌ప్రాయంగా ప‌క్క‌న పెట్టారు. ఇదీ.. ఆమె ఆత్మ‌గౌర‌వానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో చెప్పేందుకు ఉదాహ‌ర‌ణ‌.
 
అది 2013. కేంద్ర ప్ర‌భుత్వం(యూపీఏ) ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ద‌క్షిణాది నుంచి ప్ర‌సిద్ధ గాయ‌నిగా జాన కికి రెండో అత్యున్నత పౌర పుర‌స్కార‌మైన `ప‌ద్మ‌విభూష‌ణ్‌`ను ప్ర‌క‌టించారు. అయితే.. వాస్త‌వానికి ఈవిష‌యాన్ని ముందుగా సంబంధిత వ్య‌క్తుల‌కు గౌర‌వ సూచ‌కంగా తెలియ‌చేస్తారు. వారి అనుమ‌తితోనే అవార్డును ప్ర‌క‌టిస్తారు. జాన‌కి విష‌యంలో ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ.. మీడియాలో వార్త‌లు వ‌చ్చే వ‌ర‌కు ఆమెకు తెలియ‌లేద‌ని ఆమె కుమారుడు ముర‌ళీకృష్ణ అప్ప‌ట్లోనే చెప్పారు. ఈ అవార్డు ప్ర‌క‌టించే స‌మ‌యానికి క‌ర్ణాట‌క‌లో త‌ల్లీకుమారుడు ఓ వేడుక‌లో పాల్గొన్నారు.
 
ఆ స‌మ‌యంలో మీడియా ద్వారా విష‌యం జాన‌కికి తెలిసింది. ``మీకు ప‌ద్మ‌భూష‌ణ్ ప్ర‌క‌టించారు`` అంటూ మీడియా చెప్ప‌గా నే .. స‌హ‌జంగానే అవార్డు పొందిన వారు ఆశ్చ‌ర్యం వేస్తారు. కానీ, జాన‌కిలో అలాంటి క‌వ‌ళిక‌లు క‌నిపించ‌లేదు. పైగా ఆత్మ‌గౌర‌వం పొడ‌చూపింది. ``ఇది నాకు ఎప్పుడో రావాల్సింది. నేను 50 సంవత్స‌రాలుగా గాయ‌నిగా ఉన్నాను. ఇప్పుడు ఈ అవార్డు అంటే.. ఆ క‌ళామ‌త‌ల్లిని చిన్న‌చూపు చూడ‌డ‌మే. నేను ప‌ద్మాల‌కు కాదు.. ర‌త్నాల‌కు(భార‌త‌ర‌త్న‌) అర్హురాలిని`` అని ప్ర‌క‌టించి ఆత్మ‌విశ్వాసాన్ని చాటుకున్నారు. కొంద‌రు దీనిని `ధిక్కారం` అని పేర్కొన్నా.. జాన‌కి మ‌రుస‌టి రోజు వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న కంటే ఎంతో వెనుక‌బ‌డ్డ వారికి ఎలా అవార్డులు ఇచ్చారంటూ ప్ర‌శ్నించారు. ఇలా.. ఆ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును వదులుకున్నా.. ప్ర‌జ‌ల గుండెల్లో క‌ల‌కాలం నిలిచిపోయారు!!.
Tags
late singer s.janaki self respect padma bhushan rejected bharataratna
Recent Comments
Leave a Comment

Related News