ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ముంబైలో ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో కోలుకుంటున్న పవన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నిన్న పరామర్శించారు. పవన్ త్వరగా జనాల మధ్యకు రావాలని కోరుకుంటున్నారని, తానే వద్దని వారించానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పవన్ ఆరోగ్యం గురించి చంద్రబాబు మాట్లాడారు. పవన్ కు అభిమానులు చాలా ఎక్కువని, కాబట్టి ప్రస్తుతం జనంలోకి రాకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించానని చంద్రబాబు అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పిచ్చుకలంక గ్రామ రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, తాను, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 2014-19 కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేసిందని, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డయాఫ్రమ్ వాల్‌ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పునలు 89 శాతం పూర్తి చేశామని ,పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.