టీడీపీలో ప్రక్షాళన.. ఆ 9 సీట్ల‌లో కొత్త బాస్‌లు..!

admin
Published by Admin — July 12, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్న వేళ.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి రాజకీయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వం అందిస్తున్న పాలనకు తోడు, పార్టీని కూడా అంతే వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 కీలక నియోజకవర్గాల్లో భారీ ప్రక్షాళనకు టీడీపీ అధిష్ఠానం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ గ్రాఫ్ పడిపోకుండా ఉండేందుకు, స్థానిక సమీకరణాలకు అనుగుణంగా ఆయా స్థానాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించేందుకు కసరత్తు పూర్తయింది.

ఈ జాబితాలో ప్రధానంగా విశాఖ నార్త్‌, ఎచ్చ‌ర్ల‌, పి. గ‌న్న‌వ‌రం, అన‌ప‌ర్తి, అవ‌నిగ‌డ్డ‌, పిఠాపురం, తంబ‌ళ్ల‌ప‌ల్లి, విజ‌య‌వాడ వెస్ట్‌, కైక‌లూరు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కూటమి పొత్తుల కారణంగా కొన్ని స్థానాల్లో సమీకరణాలు మారగా.. మరికొన్ని చోట్ల అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం పార్టీకి తలనొప్పిగా మారాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ, కేవలం పార్టీ లైన్‌కు కట్టుబడి ఉంటూ.. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో సత్సంబంధాలు కొనసాగించే గట్టి నాయకత్వాన్ని ఆయా స్థానాల్లో కూర్చోబెట్టాలని చంద్రబాబు(Chandrababu) గట్టిగా డిసైడ్ అయ్యారు.

మ‌రోవైపు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. స్థానిక జనసేన నేతలతో పొసగకపోవడం, నిరంతరం వివాదాలు తలెత్తుతుండటంతో ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మను ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఆ స్థానంలో కొత్త వ్య‌క్తికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. ఇక రాయలసీమలోని తంబళ్లపల్లిలో తమ్ముళ్ల మధ్య తగాదాలు తారస్థాయికి చేరడంతో, అక్కడ కూడా పాత నేతలను పక్కనపెట్టి సరికొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చేందుకు అధిష్ఠానం లైన్ క్లియర్ చేసింది.

అటు ఎచ్చర్ల నియోజకవర్గంలో ప్రస్తుతం అధికారిక ఇన్‌ఛార్జ్ లేకపోవడంతో స్థానిక టీడీపీ(TDP) కేడర్ డీలా పడింది. ఇదే తరుణంలో అక్కడ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే మైలేజ్ పెంచుకుంటుండటంతో, త్వరితగతిన అక్కడ బలమైన లీడర్‌ను దించాలని బాబు భావిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన పి. గన్నవరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. చాలా కాలంగా నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు నెమ్మదించాయి. అయితే ఈసారి స్థానిక నేతకే ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలనే క్షేత్రస్థాయి డిమాండ్‌ను అధిష్ఠానం పరిశీలిస్తోంది.

ఇక మిగిలిన విశాఖ నార్త్, అనపర్తి, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్(Vijayawada West), కైకలూరు స్థానాల్లో కూడా మార్పుల వేగం పుంజుకుంది. పొత్తుల నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో మిత్రపక్షాల ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ, టీడీపీ ఓటు బ్యాంక్ చేజారిపోకుండా చూసుకోవడం చంద్రబాబుకు అత్యంత కీలకంగా మారింది. అందుకే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టులు, ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా అందరినీ కలుపుకుపోయే కొత్త బాస్‌లను నియమించేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లోనే ఈ 9 నియోజకవర్గాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Tags
TDP Chandrababu Naidu AP Politics Pawan Kalyan Andhra Pradesh TDP Incharges JanaSena BJP
Recent Comments
Leave a Comment

Related News