రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అవసరమా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి పార్టీతో ఎవరికి లాభం? అని నిలదీశారు. అంతేకాదు.. త్వరలోనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజల మధ్యకు వెళ్లనున్నారని ఆయన చెప్పారు. ఈ సమయంలో ``గొడ్డలి పార్టీ అవసరమా?`` అనే నినాదంతోనే ప్రజలను కలుస్తారని ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటామన్నారు. గొడ్డలి పార్టీ అవసరం లేదని ప్రజలే చెబుతారని అన్నారు. ఈ పార్టీకి ప్రజాస్వామ్యం అంటే లెక్కే లేదని దుయ్యబట్టారు.
``మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు?. గంజాయి తాగి.. ఆడపిల్లలను వేధించే పోకిరీలకు మద్దతు ఇస్తు న్నారు. రాముడుని, దేవుడిని దుర్భాషలాడే రావణాసురులకు మద్దతిస్తున్నారు. రౌడీలకు, గూండాలకు మద్దతు ఇస్తున్నారు. వారికి అండగా ఉంటారంట. వారికి డబ్బులు సమకూరుస్తారంట. ఏంటి మీ ఉద్దేశం? ప్రజలు ఎలా పోయినా.. ఫర్వాలేదు కానీ, గొడ్డలి పార్టీకి మాత్రం రౌడీలు, గూండాలు కావాలి. ఇలాంటి పార్టీతో ఎవరికి లాభం. ఎవరు దీని వల్ల మేలు పొందుతున్నారు?`` అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. గత ఐదేళ్లలో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డారని... తమ ఆస్తులను కొల్లగొడుతున్నారని.. భూములు కబ్జా చేస్తున్నారని ప్రజలు అల్లాడిపోయా రని రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నిరుద్యోగులు సైతం రోడ్డెక్కారని చెప్పారు. మాస్కు అడిగిన ఆపాపానికి డాక్టర్ ప్రాణాలు తీశారని ఆరోపించారు. సొంత డ్రైవర్‌నే చంపి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేశారని చెప్పారు. ``మహిళలకు ఎంపీ నగ్న వీడియోలు చేస్తాడు. అదేమని ప్రశ్నిస్తే.. మాపైనే కేసులు పెట్టారు`` అని చంద్రబాబు తెలిపారు.
మావిగన్ ప్రకటన వెనుక
వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజ ధాని విషయంలో ఒక గందరగోళం సృష్టించి.. రాజధానిలో ఎవరూ పెట్టుబడులు పెట్టకుండా చేయాలన్న దురుద్దేశం ఉందని చెప్పారు. రాజధానిని ఇప్పటికే కేంద్రం కూడా గుర్తించిందని చెప్పారు. కేంద్రం కూడా ఇక్కడ కార్యాలయాలను నిర్మిస్తోందన్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని చెప్పారు. ``అయినా .. మావిగన్ అని ఎందుకు అంటున్నారంటే.. దీని వెనుక భారీ కుట్రను సిద్ధం చేశారు. దీనిని ఛేదిస్తాం.`` అని చంద్రబాబు తెలిపారు.