ఆదివారం తెల్లవారుజామున విశాఖ(Visakha) నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గాఢ నిద్రలో ఉన్న నగర ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. ఉదయం సరిగ్గా 5 గంటల సమయం.. చల్లటి వాతావరణంలో అంతా ప్రశాంతంగా ఉన్న వేళ, ఒక్కసారిగా భూమి పొరల్లోంచి వింత శబ్దాలు, ప్రకంపనలు మొదలయ్యాయి. ఇళ్లలోని మంచాలు, వస్తువులు ఒక్కసారిగా ఊగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కేవలం కొన్ని సెకన్ల పాటు జరిగిన ఈ ప్రకృతి వింతకు సాగర్ నగర్, పెదవాల్తేరు, గాజువాక(Gajuwaka), ఆరిలోవ, ఎంవీపీ కాలనీ వంటి పలు ప్రాంతాలు వణికిపోయాయి. భూమి కంపించిన విషయాన్ని గ్రహించిన జనం.. ఇళ్లలోనే ఉంటే ప్రమాదమని భావించి, ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. చిన్న పిల్లలు, వృద్ధులతో సహా కాలనీల ప్రజలంతా అప్రమత్తమై వీధుల్లోకి వచ్చేయడంతో నగరంలో కొద్దిసేపు తీవ్ర కలకలం రేగింది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారు. కాకినాడకు సుమారు 225 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సముద్రంలో సంభవించిన ఈ కదలికల ప్రభావం విశాఖ తీర ప్రాంతాలపై తీవ్రంగా పడింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోయినప్పటికీ.. తెల్లవారుజామున వచ్చిన ఈ భూప్రకంపనలు వైజాగ్ వాసులకు మాత్రం గజగజ వణికించే అనుభవాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈ భూకంపం(Earthquake) గురించిన చర్చాంశంగా మారింది.