ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా (ప్రస్తుతం మార్కాపురం జిల్లా) పరిధిలో ఒక పెళ్లి అర్థాంతరంగా ముగిసింది. పెళ్లి కొడుకు తీరు నచ్చని పెళ్లి కుమార్తె తండ్రి అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. పెళ్లి కుమార్తెను పెళ్లికొడుకు కంట్రోల్ చేస్తున్న తీరును తప్పు పట్టి.. వివాహాన్ని క్యాన్సిల్ చేసిన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. రాచర్ల మండలం చిన్నగానిపల్లి పరిధిలోని జేసీ అగ్రహారం గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్ లోని ఒక ఐటీ కంపెనీలోని టెక్నికల్ విభాగంలో జాబ్ చేస్తున్నాడు. అతడికి కంభం మండలం తరిమెళ్లకు చెందిన యువతితో పెళ్లి ఖాయమైంది. ఆమె కూడా హైదరాబాద్ లోని ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు.
ఇరు కుటుంబాలు వ్యవసాయ నేపథ్యంతో పాటు.. ఆర్థికంగా స్థిరపడిన వారే. గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నప్పటికి ఇరువురు బాగా చదువుకొని.. హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి వేడుక శనివారం రాత్రి జరిగింది. పెళ్లి ఊరేగింపు సందర్భంగా వీరిద్దరిని డ్యాన్స్ చేయాలని కోరారు. అందుకు వధువు సరేనని చెప్పగా.. పెళ్లికొడుకు మాత్రం అందుకు నో చెప్పాడు. పెళ్లి కుమార్తెను డ్యాన్స్ చేయొద్దని చెప్పాడు.
ఈ చిన్న విషయం చిలికి చిలికి గాలివానలా మారింది. చిన్న విషయంలోనే వధువును వరుడు కంట్రోల్ చేయటం..పెళ్లికి ముందే ఇలా వ్యవహరిస్తే పెళ్లి తర్వాత ఏం కావాలన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఇలా చిన్న విషయాలకే కంట్రోల్ చేసే వారితో తమకు సంబంధం వద్దని పెళ్లికుమార్తె తండ్రి తేల్చారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి.. చివరకు పెళ్లి క్యాన్సిల్ వరకు వెళ్లింది. పెళ్లికి ముందే గొడవ పడే మైండ్ సెట్ ఉన్న అబ్బాయికి తన కుమార్తెను ఇవ్వలేనని పెళ్లికూతురు తండ్రి తేల్చేశారు. ఇలాంటి వారితో పెళ్లి జరిగితే భవిష్యత్తులో ఇబ్బంది పడుతుందని పెళ్లిని అక్కడికక్కడే రద్దు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో రెండుకుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని పెద్దలపంచాయితీలో సెటిల్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాలేదు. పెళ్లిని కుదుర్చుకున్న సమయంలో వధువు తరఫు వారు వరుడికి ఇచ్చిన కట్నపు నగదు.. ఇతర కానుకలు.. బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలని పెద్దలు తీర్పు చెప్పారు. అదే సమయంలో వరుడి కుటుంబం నుంచి తాము తీసుకున్న బంగారు వస్తువులు.. ఇతర వస్తువుల్ని పెళ్లి కుమార్తె తండ్రి వెనక్కి ఇచ్చేశారు.
అనూహ్య రీతిలో పెళ్లి క్యాన్సిల్ కావటం.. ఈ పెళ్లి కోసం తాము పెళ్లి మండపం నుంచి వంటకాల వరకు భారీగా ఖర్చు చేశామని.. ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న పెళ్లికొడుకు వారి నుంచి వచ్చింది. అయితే.. ఇదంతా పెళ్లి కుమారుడి తీరుతోనే ఇంత జరిగింది కాబట్టి.. ఆ ఖర్చును వారే భరించుకోవాలని పెద్దలు తీర్పు చెప్పారు. ఈ పెద్ద మనుషుల పంచాయితీ తర్వాత ఎలాంటి కేసులు.. వివాదాలకు వెళ్లకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నట్లుగా పేర్కొంటూ.. ఇరు వర్గాలు రాతపూర్వకంగా ఒక ఒప్పందం మీద సంతకాలు చేసుకున్నారు. ఈ ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.