అక్షరాల 116 ఏళ్లు. ఆ వయసులో ఆరోగ్యంగా ఉండటమే గొప్ప. కాలు తీసి కాలు కదపటమే చాలనుకునే పరిస్థితి. అలాంటి వయసులో కుటుంబ సభ్యులతో కలిసి తనకెంతో ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల కొండ ఎక్కిన ఆ బామ్మ సోషల్ మీడియాలో వైరల్ కావటం తెలిసిందే. కాలి నడకన అలిపిరి మార్గంలో కొండ ఎక్కే అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటం.. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావటం తెలిసిందే.
ఈ బామ్మ ఆచూకీ మీకు తెలిస్తే మాకు తెలియజేయాలంటూ టీటీడీ ఛైర్మన్ సైతం ఎక్స్ లో కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ భక్తురాలి గురించి తెలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించి.. ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘116 ఏళ్ల వయసు కూడా ఆమె భక్తికి అడ్డుకాలేకపోయింది. ఆమె కాలినడకన తిరుమలకురావటం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. నిజంగా ఇది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఈ బామ్మ ఆచూకీ కోసం టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగటం.. మొత్తానికి ఆమె ఆచూకీని గుర్తించటం తెలిసిందే. ఆమెకు.. ఆమె కుటుంబానికి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం వెనువెంటనే అమలు చేశారు. తిరుపతిలోని జీవనకోనలో బంధువుల ఇంట్లో ఉన్న ఆమెను నవవీనతమ్మగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఆమెకు ఈ రోజు (సోమవారం) ఉదయం తిరుమలలో బ్రేక్ దర్శనంలో శ్రీవారిదర్శనం చేయించారు. ఆమెకు మాత్రమే కాదు.. ఆమె కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శన ఏర్పాట్లు చేశారు.
నవనీతమ్మ గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టే సమయంలో.. ఆమెకు అసరాగా ఉండేందుకు వీలుగా నలుగురు టీటీడీ సిబ్బంది ఆమెకు సాయంగా నిలిచారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా దర్శనం పూర్తి చేయటంతో పాటు.. స్వామివారి తీర్థప్రసాదాల్ని అందజేసినట్లుగా తెలుస్తోంది. ఒక సామాన్య భక్తురాలి విషయంలో స్పందించటం..ఆమె ఆచూకీని గుర్తించి..ఆమెకు ప్రత్యేక బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ తీరును మెచ్చుకోవాల్సిందే. ఈ సందర్భంగా శభాష్ టీటీడీ అనకుండా ఉండలేని పరిస్థితి.