రాజకీయాల్లో అవసరం ముగిసిపోతే ఆదరణ ఎలా మాయమవుతుందో చెప్పడానికి తాజా పరిణామాలు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ఏ నాయకుడి రాక కోసం అయితే పార్టీలు వేయి కళ్లతో ఎదురుచూశాయో, ఏ గొంతుకైతే ఒక సామాజిక వర్గాన్ని కదిలించిందో.. ఈరోజు అదే గొంతు ఆసుపత్రి గదిలో శ్వాస కోసం కొట్టుమిట్టాడుతోంది. కాపు సామాజికవర్గ అగ్రనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నారు. కానీ, ఏ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆయన తన సర్వస్వాన్ని పణంగా పెట్టారో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి కనీస పరామర్శ కూడా కరువడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సమయంలో ముద్రగడ వంటి సీనియర్ నేత అండను వైసీపీ(YCP) ఎంతగానో కోరుకుంది. జగన్ కోసమే ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకునేంతగా ఆ పార్టీతో మమేకమయ్యారు. గోదావరి జిల్లాల్లో పార్టీ జెండాను మోస్తూ, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ ఐదేళ్ల పాటు శ్రమించారు. తీరా ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే, కనీసం ఫోన్ చేసి పలకరించే తీరిక కూడా వైఎస్ జగన్‌కు లేకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. అవసరం ఉన్నంత వరకే నేతలను వాడుకుని, ఆ తర్వాత కరివేపాకులా తీసిపారేసే నైజానికి జగన్ ప్రవర్తనే నిదర్శనమంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా మండుతున్నాయి.
కేవలం జగన్(Jagan) మాత్రమే కాదు, వైసీపీలోని కీలక నేతలు ఎవరూ కూడా ముద్రగడ ఆరోగ్యంపై స్పందించకపోవడం ఆ పార్టీ అంతర్గత సంస్కృతిని ప్రశ్నార్థకం చేస్తోంది. పార్టీలో కరడుగట్టిన రౌడీ మూకలకు, వివాదాస్పద శక్తులకు ఇచ్చే ప్రాధాన్యత.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ముద్రగడ వంటి పెద్దాయనకు ఇవ్వకపోవడం పట్ల కాపు సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాణాలతో పోరాడుతున్న ఒక సీనియర్ నేతను పరామర్శించడానికి కనీస మానవత్వం, కృతజ్ఞతా భావం లేని నాయకత్వమా మనకున్నది? అంటూ పార్టీ శ్రేణుల్లోనే అంతర్గత మథనం మొదలైంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.