కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసి రాక అనుకున్నంతగా ఆడవు. కొన్ని సినిమాలకేమో యావరేజ్ టాక్ వచ్చినా.. అన్నీ కలిసొచ్చి అవి అంచనాలను మించి విజయం సాధిస్తుంటాయి. గత శుక్రవారం రిలీజైన సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ రెండో కోవకే చెందుతుంది. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట అనూహ్యంగా మంచి హైప్ వచ్చింది.
రిలీజ్ రోజు టాక్ యావరేజ్, ఎబోవ్ యావరేజ్ అన్నట్లుగా వచ్చినా సరే.. వసూళ్ల మోత మోగిపోయింది. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి చాలా షోలు అడ్వాన్స్ ఫుల్స్ పడడం.. వీకెండ్ అంతా ప్యాక్డ్ హౌస్‌లతో నడవడం మామూలు విషయం కాదు. వీకెండ్లో ఏకంగా రూ.40 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్‌కు షాకిచ్చింది. ఐతే వీకెండ్ అయిపోయింది కదా అని ఈ సినిమా పనైపోయిందని అనుకుంటే పొరపాటే. ‘మా ఇంటి బంగారం’ కథ ఇంకా మిగిలే ఉంది.
వీకెండ్ అయింది కాబట్టి వసూళ్లు కొంచెం తగ్గడం సహజమే. కానీ ఇంకో వారం పది రోజుల పాటు ‘మా ఇంటి బంగారం’ రన్ కొనసాగుతుందన్నది స్పష్టం. ముఖ్యంగా రెండో వీకెండ్లో ఈ చిత్రానికి మళ్లీ హౌస్ ఫుల్స్ పడితే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ వారం తెలుగు నుంచి అసలు రిలీజ్‌లే లేవు. జులై ఫస్ట్ వీకెండ్లో నాగబంధం, రావు బహదూర్ లాంటి క్రేజీ చిత్రాలు రిలీజవుతున్నాయి. గత వీకెండ్లో ఒకేసారి ఐదు సినిమాలు రిలీజయ్యాయి. అందుకే ఈ వీకెండ్‌ను ఖాళీగా వదిలేస్తున్నారు. చిన్న సినిమాలు కూడా ఏవీ రిలీజ్ కావట్లేదు.
దీంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ లీడర్‌గా నిలిచిన సమంత సినిమానే తర్వాతి వీకెండ్లోనూ లీడ్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత వారం సినిమాల్లో దీవానా, బాలన్, వంద దేవుళ్లు కూడా మంచి టాకే తెచ్చుకున్నప్పటికీ.. అవి సామ్ సినిమాకు పెద్దగా పోటీ ఇవ్వట్లేదు. ‘పెద్ది’ ప్రభావం కూడా బాగా తగ్గిపోగా.. ‘మా ఇంటి బంగారం’కు ఇంకో వారం పాటు ఎదురు లేనట్లే కనిపిస్తోంది. కాబట్టి ఫుల్ రన్లో ఈ సినిమా బాక్సాఫీస్ నంబర్స్ ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయన్నది స్పష్టం.