విజయవాడలోని కృష్ణలంకకు చెందిన యువకుడు గాదె సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీసుల కస్టడీలో సాయికృష్ణ మృతి చెందాడని, ఆ తర్వాత పోలీసులు అతడి శరీరాన్ని దహనం చేసి కనీసం బూడిద కూడా మిగల్చకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్ నియమించింది. ఈ సిట్ దర్యాప్తు బృందంలో పలు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు సభ్యులుగా ఉన్నారు. పోలీసులతోపాటు టెక్నికల్, ఫోరెన్సిక్ నుంచి సహాయ సహకారాలు కూడా తీసుకునే విధంగా సిట్ కు పూర్తి స్థాయి అధికారులు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సీఐ నాగరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. విచారణ తర్వాత నాగరాజును అరెస్టు చేసే అవకాశాలున్నాయి.