నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో యోగాంద్ర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఘనంగా నిర్వహించారు. యోగా గురువు బాబా రాందేవ్ తో కలిసి చంద్రబాబుతో పాటు పలువురు యోగాసనాలు వేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మొత్తం రెండు చోట్ల 7 వేల మంది యోగాసనాలు వేసేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, పలువురు టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు.
చంద్రబాబు, లోకేష్ తో రాందేవ్ బాబా ప్రాణాయామం చేయించారు. వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామ స్మరణతో చంద్రబాబు యోగా సాధన చేశారు. రోజు అరగంట వ్యాయామం చేయాలని, ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేదని చంద్రబాబు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారికి యోగా వర్తిస్తుందని చెప్పారు. మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ఒత్తిడి రహిత జీవితానికి యోగా దోహదం చేస్తుందని మోడీ చెప్పారు. అయితే, కొన్ని సందర్భాలకే పరిమితం కాకుండా నిత్యం యోగా సాధన చేయాలని. అందువల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మరింత మెరుగైన ప్రపంచం కోసం యోగా అవసరమని పిలుపునిచ్చారు.