సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణం పొలాన్ని ఆయన సందర్శించారు. నాలుగేళ్లుగా రసాయనాలు లేకుండా పొలం సాగు చేస్తున్న రైతు నాగభూషణాన్ని అభినందించారు. నాగభూషణం నిర్వహిస్తున్న ఆర్గానిక్ వేరుశనగ గానుగను పరిశీలించారు.
కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె కొనాలని చంద్రబాబుకు రైతు సూచించారు. దీంతో, తన భార్య భువనేశ్వరికి ఫోన్ చేశారు. ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా ఆమెను అడగాలి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత లీటర్ నూనెను కొనుగోలు చేశారు. ఆ తర్వాత గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని కూడా చంద్రబాబు సందర్శించి జీవామృతం తయారీని పరిశీలించారు.
అక్కడ సాగు చేస్తున్న బొప్పాయి తోటను పరిశీలించి పండు రుచి చూశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంప్రదాయ పరిశ్రమలైన గానుగలు బలం అందిస్తాయని ప్రశంసించారు.