మూసి ప్ర‌క్షాళ‌నకు ర‌క్ష‌ణ భూములు.. రేవంత్ హ్యాపీ

admin
Published by Admin — June 20, 2026 in Telangana
News Image

మూసీన‌ది ప్ర‌క్షాళ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారుకు కేంద్రం నుంచి తీపి క‌బురు అందింది. కేంద్రం నుంచి త‌మ‌కు ఎలాంటి స‌హ‌కారం అంద‌డం లేద‌ని ఆరోపిస్తున్న ఆయ‌న‌కు.. తాజాగా ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన 83 ఎక‌రాల్లో మూసి న‌ది ప్ర‌క్షాళ‌న ప‌నులు చేసుకునేందుకు అనుమ‌తులు ఇస్తూ.. తాజాగా కేంద్రం నుంచి వ‌ర్త‌మానం అందింది. ఈ భూములు ఇప్ప‌టి వ‌ర‌కు ర‌క్ష‌ణ శాఖ ప‌రిదిలో ఉన్నాయి. వీటిని త‌మ‌కు ఇప్పించాలంటూ..సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్నికోరారు.

ఈ విష‌యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు క‌నీసం ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ వివాదం కొన‌సాగుతున్న స‌మయంలో శుక్ర‌వారం కేంద్రం నుంచి 83 ఎక‌రాల భూముల వినియోగానికి సంబంధించి అనుమ‌తులు ఇస్తూ.. ప‌చ్చ‌జెండా ఊపారు. గోల్కొండ ఆర్టిల‌రీ ప‌రిధిలో ఉన్న‌ ఈ భూముల విలువ 533 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఉంటుంది. వీటిని రాష్ట్రానికి బ‌దలాయిస్తూ.. కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. ఈ సొమ్మును రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించాలా? వ‌ద్దా? అనే విష‌యంపై స్ప‌ష్టత ఇవ్వ‌లేదు.

వాస్త‌వానికి రక్ష‌ణ శాఖ భూముల‌ను రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ప్పుడు.. అంతే మొత్తం భూముల‌ను వేరే చోట కేటాయి స్తారు. ఇప్పుడు ఇదే ప‌ద్ధతిలో కేంద్రం భూములు కేటాయించిందా? లేక‌.. ఆ సొమ్మును రిక‌వ‌రీ చేసుకుంటుందా? అనేది చూడాలి. ఇక‌, మూసీ ప్ర‌క్షాళ‌న‌లో ఈ భూములు అత్యంత కీల‌క‌మ‌ని సీఎంరేవంత్ రెడ్డి చెబుతున్నారు. వీటి ద్వారా ప్రాజెక్టు నిర్మాణం మ‌రింత వేగం పుంజుకుంటుంద‌ని బావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త ఏడాది కూడాఈ భూముల విష‌యంపై కేంద్రాన్ని సంప్ర‌దించారు.

కాగా.. ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయిస్తూ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది మూసీ ప్రాజెక్టు పున‌రుజ్జీవానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న చేయ‌డం ద్వారా.. మూడు జిల్లాల‌కు తాగు, సాగునీరు అందుతుంద‌ని తెలిపారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ బాధిత ప్ర‌జ‌ల‌కు.. ఈ ప్రాజెక్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. వ‌చ్చేఏడాది నాటికి మూసీ ప్ర‌క్షాళ‌న ప్రాజెక్టును పూర్తి చేయ‌డంతోపాటు.. హ‌రిత వ‌నంగా మూసీ ప‌రివాహ‌క ప్రాజెక్టును పూర్తి చేయ‌నున్నారు. 

Tags
Cm revanth reddy moosi river lands defence
Recent Comments
Leave a Comment

Related News