తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలకు భారీ ఊపు రానుంది. తాజాగా ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మణికొండలోని మల్కం చెరువు సమీపంలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీ నుంచి మధ్యాహ్నం వచ్చిన ఆయన.. అప్పటికే పూర్తయిన ఏర్పాట్ల మధ్య కార్యాలయంలోకి అడుగు పెట్టారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం.. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూల మాల వేసి నమస్కరించారు. ఆ తర్వాత.. పార్టీ కార్యాలయం ప్రారంభించారు.
విస్తరణ వడివడిగా..
తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ప్రకటించిన దరిమిలా.. కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు పార్టీకి మరింత ఊతం ఇస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న కార్యకర్తల సంఖ్య కూడా పెరుగుతుందని అంటు న్నారు. మరింత ఆత్మవిశ్వాసంతో పార్టీ ఎదిగేందుకు ఈ కార్యాలయ ప్రారంభం దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యాలయం లో కార్యకర్తలకు.. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు వినేందుకు జనవాణి పేరుతో విభాగాన్ని కూడా కేటాయించారు. తద్వారా ప్రజలకు చేరువ అయ్యేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గ్రేటర్‌పైనే ఎక్కువగా..
త్వరలోనే జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టనుందని నాయకులు ఆఫ్‌దిరికార్డుగా పేర్కొ న్నారు. సెప్టెంబరులోగా గ్రేటర్‌కు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం తోపాటు.. ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అదేసమయంలో ఇతర పార్టీల నుంచి చేరికలను కూడా ప్రోత్సహించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ, కేరళ, ఢిల్లీలలో జనసేన చేరిక కమిటీలను ప్రతిపాదించారు. అలానే తెలంగాణలోనూ చేరికలకోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.
కార్యకర్తల్లో కదలిక..
ఈ నెల 2న పార్టీ సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించినా.. పోలీసులు అనుమతించని విషయం తెలిసిందే. ఈ క్రమంలో నే ప్రెస్ మీట్ చేపట్టారు. అయితే.. ఈ నెలాఖరులోగా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.. ప్రస్తుతం ప్రారంభించిన కార్యాలయంతో.. కార్యకర్తల్లోనూ కదలిక వస్తుందని భావిస్తున్నారు. ఉన్న కార్యకర్తలకు తోడు.. మరింత మంది చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా.. సమావేశంపై పవన్ నిర్ణయం తీసుకుంటారని.. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని నాయకులు చెబుతున్నారు.