రోటీన్ బీజేపీ ప్రజాప్రతినిధులకు భిన్నంగా వ్యవహరించే తీరు ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సొంతంగా చెప్పాలి. టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉంటూ.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి వేళ.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన బీజేపీలోకి చేరిపోవటం తెలిసిందే. పారిశ్రామికవేత్తగా.. లాబీయింగ్ లో ఆయన దిట్టగా చెబుతారు. 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభా స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి మరీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తాజాగా టీఎంసీ అసంతృప్త ఎంపీలు రెబెల్స్ గా మారి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. ఈ ఆపరేషన్ కు బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ లు పర్యవేక్షిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికి.. మాస్టర్ స్కెచ్ వేసింది మాత్రం సీఎం రమేశ్ అన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.
హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఒప్పించటమే తనకున్న అతి పెద్ద నైపుణ్యంగా తన గురించి చెప్పుకున్న సీఎం రమేశ్.. ‘రెండు గటల సమయం చాలు. ఎవరినైనా సరే బీజేపీలో చేరేలా ఒప్పించటానికి. నేను వారిని ఒప్పిస్తా’ అంటూ ధీమాగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు జాతీయస్థాయిలో సంచలనంగా మారాయి. కొత్త చర్చకు తెర తీశాయి. బీజేపీలో ఆయన పాత్రపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకూ సీఎం రమేశ్ కు ఇంతటి నెట్ వర్క్ ఎలా సాధ్యమన్న దానికి సమాధానం ఇట్టే చెప్పేస్తారు.
వ్యాపార రంగంలో ఉండటం.. రాజ్యసభ సభ్యుడిగా పని చేయటం.. మిగిలిన పార్టీ నేతలతో స్నేహ సంబంధాలు నెరపటం లాంటివి సీఎం రమేశ్ బలాలుగా చెబుతారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో క్యాంటిన్ వద్ద తరచూ కలవటం.. వారితో మాట్లాడటం ద్వారా పలువురు ఎంపీలకు ఆయనకు సుపరిచితంగా చెబుతారు. వారి అవసరాల్ని ఇట్టే తీర్చేయటంతో సీఎం రమేశ్ ముందుంటారన్న మాటను చెబుతుంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని తనదైన శైలిలో ఆయన చెప్పటం విశేషం.
‘‘పార్లమెంట్ సమావేశాల సమయంలో క్యాంటీన్ లో తరచూ కలవటం ద్వారా కొన్నేళ్లుగా టీఎంసీ ఎంపీలతో మంచి స్నేహ బంధం ఉంది. 2020లో హైదరాబాద్, దుబాయ్ లో జరిగిన నా కొడుకు పెళ్లి వేడుకలకు వారు వచ్చారు. పార్టీలకు అతీతంగా పలువురు టీఎంసీ నేతలు హాజరయ్యారు. వారితో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. వారిని ఎప్పుడూ ప్రలోభాలకు గురి చేయలేదు. కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే మాట్లాడేవాడిని’’ అని పేర్కొన్నారు.
టీఎంసీ అసంతృప్త ఎంపీలతో సీఎం రమేశ్ ఫోన్ లో టచ్ లో ఉండటమే కాదు.. వారు తీసుకునే నిర్ణయాలకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్న వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. అయితే.. సీఎం రమేశ్ నోటి నుంచి వచ్చిన 2 గంటల మాటకు టీఎంసీ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా రియాక్టు అయ్యారు. సీఎం రమేశ్ ను గొప్పలు చెప్పుకునే వ్యక్తిగా పేర్కొంటూ.. ఆయన తనకు మంచి మిత్రుడేనని చెబుతూ.. ‘‘ఆయనకు ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఇష్టం. మాలో కొందరు క్షేత్రస్థాయిలో ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటాం. మరికొందరు నెట్ వర్కు మీద ఎక్కువ కలిగి ఉండటంలో చురుగ్గా ఉంటారు. సీఎం రమేశ్ ఎప్పుడూ బీజేపీకి ఎంతగా ఉపయోగపడాలన్న విషయాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు’’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రమేశ్ మీద ఆమె ఒక ఆసక్తికర పోలిక చేశారు. ‘సీఎం రమేశ్ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే.. బెంగాల్ లో ఒక కేక్ తయారవుతుంది. తాను వెళ్లి అందులో చిన్న భాగం కావాలని తపిస్తారు. ఆ బెంగాల్ కేక్ తయారు చేసే వంటవాడు ఆయన కాదు. దానికి అవసరమైన సామాగ్రిని అందించేది ఆయన కాదు. కానీ.. ఆయన మాత్రం హటాత్తుగా తన వద్ద ఆ కేక్ కు సంబంధించి రెండు.. మూడు ముక్కలు ఉన్నాయని చెబుతారు’’ అంటూ సీఎం రమేశ్ ను గొప్పలు చెప్పే వ్యక్తి మాత్రమే తప్పించి.. ఆయనకు అంత సీన్ లేదన్న రీతిలో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. సీఎం రమేశ్ అందరివాడు అన్న మాటలో నిజం ఉందన్న విషయాన్ని మహువా మోయిత్రా కూడా తన వ్యాఖ్యలతో ఒప్పుకున్నట్లుగా చెప్పక తప్పదు.