రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడి వ్యవహారం.. ఆయన కుమారుడి చుట్టూ తిరుగుతోంది. `అన్నీ మా అబ్బాయి చూసుకుంటాడు` అని మంత్రిగారు చెబుతున్నట్టు నియోజకవర్గంలో పెద్ద టాక్ నడుస్తోంది. సీమకు చెందిన ఈ మంత్రికి చంద్రబాబు(Chandrababu) మంచి మార్కులు కూడా వేశారు. అంతేకాదు.. ఫైళ్ల క్లియరెన్సులో ఒక దశలో ఈయన ముందు వరుసలో కూడా ఉన్నారు. కానీ.. నియోజకవర్గంలో మాత్రం మైనస్ అయ్యారు.
సాధారణంగా..మంత్రులన్నాక.. బిజీగా ఉంటారు. దీనిని ఎవరూ కాదనరు. ఇక, ఏపీ(AP) వంటి సంక్లిష్ట రాజకీయాలు ఉన్న రాష్ట్రాల్లో ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు, వారు చేసే రాజకీయాలువంటివి ఎదుర్కొనేందుకు మంత్రులుగా ఉన్నవారు మరింత కష్టపడుతున్నారు. అయితే.. నియోజకవర్గాల్లో పనులు చూసుకునేందుకు.. కుటుంబ సభ్యులను వినియోగించడం.. కాంట్రాక్టులు వంటివాటి విషయంలో అబ్బాయి పేరు జోరుగా వినిపిస్తుండడం వంటివి మంత్రికి ఎలా ఉన్నా.. నియోజకవర్గంలో మాత్రం మైనస్ అవుతున్నాయి.
ఇక, ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది.. వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకొంటున్నానని.. తన కుమారుడే పోటీ చేస్తారని మంత్రి(Minister) బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటప్పుడు.. ఆయన తన కుమారుడిని ప్రజల మధ్యకు పంపించే విధానం వేరేగా ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలి. కానీ, వేరే రూట్‌లో కుమారుడు రాజకీయాలు చేస్తున్నారు. దీనిని అరికట్టే విషయంలో మంత్రి విఫలమవుతున్నారన్నది వాస్తవం. ఇక, రెండేళ్లలో మంత్రిగా ప్రజలకు చేరువ అయ్యారా? అంటే.. చెప్పడం కష్టమేనని సొంత పార్టీనాయకు లే చెబుతున్నారు.
కానీ.. తన సామాజిక వర్గంలో మాత్రం మంత్రిని మంచి పేరుంది. వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి మరకలు కూడా లేవు. కానీ.. అన్నీ తనయుడే చుట్టబెడుతున్నారన్న వాదన నుంచి బయట పడాల్సిన అవసరం.. నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి వేరు.. వచ్చే ఎన్నికల(Election) నాటికి ఉండే పరిస్థితి వేరు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సొంత సామాజిక వర్గంలోనూ వినిపిస్తున్న మాట. రెండేళ్లు గడిచాయి.. అసలు స్టోరీ ముందుంది.. మరి మంత్రిగారు ఏం చేస్తారో చూడాలి.