వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తాము ‘మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్’ అనిపించుకుంటున్నారు స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందణ్ణ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. తాజాగా సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. పెళ్లి సమయంలో తాము ప్రకటించిన ఒక గొప్ప ఆశయానికి అధికారికంగా శ్రీకారం చుట్టి, అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
విజయ్ దేవరకొండ తండ్రి జన్మించిన తెలంగాణలోని అచ్చంపేట మండలం, తుమ్మనపేట గ్రామం వేదికగా ఈ సరికొత్త సేవా కార్యక్రమం ప్రారంభమైంది. తమ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ పల్లెటూరి నుంచే మార్పు మొదలుకావాలని ఈ జంట భావించింది. ఇందులో భాగంగా ‘దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా స్థానికంగా ఉన్న సుమారు 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. విజయ్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, రష్మిక(Rashmika) దాన్ని రీషేర్ చేస్తూ రీల్ అండ్ రియల్ లైఫ్ పార్ట్‌నర్‌గా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ విద్యా సహాయాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫీజులు చెల్లించడంతో పాటు, వారికి అవసరమైన నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్‌ను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. పదో తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన దశ కావడంతో, ఆ సమయంలో తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూడాలనేది ఈ స్టార్ కపుల్(Star Couple) సంకల్పం. సెలబ్రిటీలు అంటే కేవలం లగ్జరీ లైఫ్ మాత్రమే కాదు, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనూ ముందుంటారని వీరు నిరూపించారు.
కాగాచ ఒకవైపు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాల్లోనూ ఈ జోడీ సరికొత్త రికార్డులకు సిద్ధమవుతోంది. వివాహం తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి(Ranabaali)’. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. నిజ జీవితంలోనే కాకుండా, వెండితెరపై కూడా ఈ క్రేజీ కపుల్ ఒక విలక్షణమైన కథతో మెప్పించడానికి వస్తుండటంతో అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
