వైసీపీ అధినేత జగన్ వైఖరిపై సామాన్య ప్రజలు సైతం నవ్విపోతున్నారు. ఆయన ప్రజల్లోకి రాకపోయినా..వార్తే, వచ్చినా వార్తే.. అన్నట్టుగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం.. ఆయన మతి మరుపా..? లేక సబ్జక్టుపై అవగాహన లేకపోవడమా? అనేది ప్రశ్న. ఈవిషయంలో జగన్ సొంత నేతల నుంచి సామాన్యుల వరకు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రాజధాని రైతులు జగన్‌నుకలిసినప్పుడు.. ``పెనుమాకలో మేం భూములు ఇచ్చాం. అయినా.. పట్టించుకోలేదు.`` అని జగన్‌కు కొందరు రైతులు చెప్పారు. మరికొందరు.. తమ స్థలాల కొలతలు చెప్పారు.
అయితే.. రాజధానిని వ్యతిరేకిస్తున్న జగన్. కనీసం దాని హద్దులు.. అందులోని గ్రామాల గురించిన సమాచారం కూడా లేకుండా వ్యవహరించారు. రైతులు పెనుమాక గ్రామం గురించి చెప్పినప్పుడు..`అది ఎక్కడుంది?`` అని ప్రశ్నించడంతో రాజధాని రైతులు విస్మయం వ్యక్తం చేశారు. దీంతో రైతులే.. అమరావతి హద్దులు.. ఎంత మంది రైతులు భూములు ఇచ్చారు.. వంటి వివరాలను ఆయనకు వివరించారు.. ఆతర్వాత కానీ.. జగన్‌కు అర్ధం కాలేదు. ఇక, ఎక్కడికి వెళ్లినా.. పట్టుమని నాలుగు వాక్యాలు నేరుగా మాట్లాడలేని పరిస్థితిని కూడా జగన్ ఎదుర్కొంటున్నారు. చూసి చదవాలి.. చూసి మాట్లాడాలి.. అనే విధంగా ఉంది.. ఆయన పరిస్థితి.
తాజాగా..
తాజాగా జగన్ విశాఖపట్నంలో పర్యటించారు. ఇక్కడి స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం.. కొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వీరిని జగన్ బుధవారం పరామర్శించారు. తమ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు.. కోటి రూపాయల సాయం అందించామన్నారు. ఇది తప్ప.. ఆయన ఇంకే విషయాలను చూడకుండాచెప్పక పోవడం.. గమనార్హం. అన్నింటికీ తడుముకున్నారు. అంతేకాదు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎంత ఉక్కు ఉత్పత్తి అవుతుంది.. ఎంత మంది కార్మికులు ఉన్నారు.. అనే విషయాలను కూడా అధ్యయనం చేయకపోవడం.. సమాచారాన్ని ముందుగానే తెప్పించుకోకపోవడంతో తీవ్రంగా తడబడ్డారు.
దీంతో జగన్ వెనుకే నిలబడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్రతి విషయాన్నీ జగన్ వివరించే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అంతేకాదు..ప్రతిసారీ.. జగన్‌కు కొన్ని పత్రాలు అందించారు. వాటిని చూసి చదవాల్సిన జగన్.. అక్కడ కూడా తడబ డ్డారు. దీంతో జగన్‌కు అవగాహన లేదన్న విషయం స్పష్టమైందని పొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానించారు. ఇక, సాధారణ ప్రజల మాట సరేసరి. దీనిపై టీడీపీ నాయకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కార్మికులపై ప్రేమతో వెళ్లి ఉంటే.. జగన్ కొంత వరకైనా అవగాహన తెచ్చుకుని మాట్లాడేవారని.. రాజకీయం కోసం ఆయన హడావుడిగా వచ్చారని.. వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు