ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయంతో కింగ్ మేకర్‌గా ఎదిగిన జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇప్పుడు తన తదుపరి వ్యూహానికి పదును పెడుతున్నారు. ఇప్పటివరకు కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేన ముద్రను, ఇకపై జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే తన పార్టీకి చెందిన 150 మంది ముఖ్య నేతల బలగంతో కలిసి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా, దేశ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపనున్నారు. ‘సేన గళం’ అనే సరికొత్త రాజకీయ భావజాలాన్ని ఆయన ఈ ఢిల్లీ(Delhi) పర్యటన ద్వారా దేశానికి పరిచయం చేయబోతున్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేనకు జాతీయ స్థాయి ఆశయాలు, సిద్ధాంతాలు ఉన్నాయని చాటిచెప్పడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఆలోచనలను, వారి ఆశయాలను ప్రతిబింబించేలా ఈ వినూత్న వేదికను పవన్ కళ్యాణ్ మలచబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయాల్లో యువత పాత్ర కేవలం ఓటర్లుగానే మిగిలిపోతోందనేది పవన్ కళ్యాణ్ భావన. అందుకే, యువతను కేవలం రాజకీయంగా వాడుకోవడం కాకుండా, వారి ఆలోచనలకు ఒక జాతీయ వేదిక కల్పించడమే 'సేన గళం(Sena Galam)' వెనుక ఉన్న అసలు వ్యూహం. జనసేన సిద్ధాంతాలు కేవలం ఒక్క రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న యువతను ప్రభావితం చేయగలవని నిరూపించేందుకు హస్తిన వేదికగా పవన్ కళ్యాణ్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.
150 మంది కీలక నేతలతో పవన్ చేస్తున్న ఈ త్రీ-డేస్ టూర్ ఏపీ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఆసక్తి రేపుతోంది. ఈ పర్యటన ద్వారా జనసేన(Janasena) గ్రాఫ్ జాతీయ రాజకీయాల్లో ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా కాకుండా, దేశ యువతకు ప్రాతినిధ్యం వహించే ఒక జాతీయ నాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు పవన్ కళ్యాణ్ వేసిన ఈ నయా ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.